సరిహద్దుల్లో డ్రాగన్‌ మరో కుట్ర | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో డ్రాగన్‌ మరో కుట్ర

Published Mon, Dec 7 2020 4:43 AM

China Sets Up 3 Villages Near Arunachal Pradesh - Sakshi

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్‌ సరిహద్దుల్లో డ్రాగన్‌ దేశం మరో కుట్రకు తెరలేపింది. మెక్‌మోహన్‌ రేఖ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుమారు 65 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం తమదేనంటూ వాదించేందుకు సరిహద్దులకు అత్యంత సమీపంలో మూడు వరకు గ్రామాలను నిర్మించింది. తూర్పు లద్దాఖ్‌లో ఒకవైపు భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతూనే మరోవైపు ఈ ప్రణాళికను అమలు చేసింది. భారత్‌–చైనా–భూటాన్‌ సరిహద్దులు కలిసే బూమ్‌లా కనుమకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో ఈ గ్రామాలను ఏర్పాటు చేసింది.

ఇంటర్నెట్‌ సహా అన్ని వసతులను కల్పించింది. అన్ని వేళలా ప్రయాణించేందుకు వీలుండే రహదారులను నిర్మించింది. హన్‌ చైనీయులు, టిబెట్‌ కమ్యూనిస్టు పార్టీకి చెందిన పశుపోషకులను ఈ గ్రామాల్లోకి తరలించింది. 2017లో భారత్‌– చైనా బలగాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన చోటు చేసుకున్న ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో, భూటాన్‌ భూభాగంలో కొన్ని గ్రామాలను చైనా అక్రమంగా నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడైన వారానికే ఈ పన్నాగం బయటపడటం గమనార్హం.

క్రమక్రమంగా సరిహద్దులకు సమీపంలోకి చొచ్చుకువచ్చి తిష్టవేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ 2017లోనే అప్పటి ఆర్మీ చీఫ్, ప్రస్తుత చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెచ్చరించడం గమనార్హం. అరుణాచల్‌  సరిహద్దుల వెంట ఉన్న భూభాగం అంతా తమదేనని వాదించేందుకు చైనా ఈ ఎత్తుగడలకు పాల్పడుతోందని విశ్లేషకుడు డాక్టర్‌ బ్రహ్మ చెల్లనీ అంటున్నారు.  భారత్‌ మాత్రం మెక్‌మోహన్‌ రేఖే సరిహద్దులకు ప్రాతిపదిక అంటూ తిప్పికొడుతోంది.

ఉపగ్రహ చిత్రాలు ఏం చెబుతున్నాయి?
ప్లానెట్‌ ల్యాబ్స్‌ నుంచి ఎన్‌డీటీవీ సంపాదించిన నివేదికను బట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఉపగ్రహ చిత్రాన్ని బట్టి భారత సరిహద్దులకు సమీపంలోని కొండలపై 20 వరకు ఇళ్లున్న ఒకే ఒక్క గ్రామం ఉంది. నవంబర్‌ 28వ తేదీన ఉపగ్రహం పంపిన రెండో చిత్రంలో అక్కడికి సమీపంలోనే మరో 50 వరకు ఇళ్ల నిర్మాణాలు కనిపిం చాయి. మరో 10 ఇళ్ల నిర్మాణా లతో మరో ప్రాంతం కూడా అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు ఎన్‌డీటీవీ తెలిపింది. మొత్తంగా చైనా ఆ ప్రాంతంలో కనీసం మూడు గ్రామాలను నిర్మించినట్లు తేలింది. చైనా అధికార గ్లోబల్‌ టైమ్స్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ గ్రామాల్లో ఉండే పశుపోషకులు సరిహద్దులను కాపలా కాస్తుంటారని కూడా పేర్కొంది.

ఫిబ్రవరి 17న తీసిన తొలి చిత్రంలో కొత్తగా నిర్మించిన గ్రామాలు (వృత్తంలో)
నవంబర్‌ 28 నాటి రెండో చిత్రంలో కొత్తగా వెలిసిన నివాసాలు (వృత్తంలో)  

Advertisement
Advertisement