ఆగని డ్రాగన్‌ ఆగడాలు

China moves PLA battalion across India is Lipulekh Pass - Sakshi

లిపులేఖ్‌పై చైనా కన్ను

వెయ్యి మందికిపైగా సైన్యం మోహరింపు

న్యూఢిల్లీ: డ్రాగన్‌ దేశం మళ్లీ బుసలు కొడుతోంది. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి దురాక్రమణకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో లిపులేఖ్‌ పాస్‌లో సైనికుల్ని మోహరించింది. వెయ్యి మందికి పైగా చైనా సైనికులు లిపులేఖ్‌లో మోహరించినట్టుగా భారత్‌ మిలటరీ సీనియర్‌ కమాండర్‌ చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు లద్దాఖ్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా విదేశాంగ మంత్రి చాంగ్‌ యీ మధ్య జరిగిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినా చైనా మాట నిలబడలేదు. లిపులేఖ్‌ పాస్, ఉత్తర సిక్కింలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా లిబరేషన్‌ ఆర్మీ సైన్యం తిష్ట వేసిందని అధికారి చెప్పారు. చైనా ఆగడాలను దీటుగా ఎదుర్కోవడానికి భారత్‌ కూడా సన్నాహాలు చేస్తోంది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి భారతీయ సైన్యానికి దుస్తులు, టెంట్లను అమెరికా, రష్యా, యూరప్‌ నుంచి కొనుగోలు చేయనుంది.

ఏమిటీ లిపులేఖ్‌ పాస్‌?
హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్లే మార్గంలో లిపులేఖ్‌ పాస్‌ ఉంది. 1992లో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిపులేఖ్‌ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్‌ 80కి.మీ. రోడ్డుని నిర్మించడంపై నేపాల్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిపులేఖ్‌ పాస్‌ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు చైనా ఈ మార్గంపైనే కన్నేసింది.

ఐరాసకు నేపాల్‌ కొత్త మ్యాప్‌
భారత్‌ వ్యతిరేక ధోరణిని నేపాల్‌ మరింత తీవ్రతరం చేస్తోంది. మన దేశ భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలను నేపాల్‌లో అంతర్భాగంగా చూపిస్తూ తయారు చేసిన మ్యాప్‌ను ఐక్యరాజ్య సమితికి. గూగుల్‌కి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతాలను తమ దేశ భాగంలో చూపించడానికి నేపాల్‌ రాజ్యాంగ సవరణ చేసిన విషయం తెలిసిందే. నేపాల్‌ ఈ చర్యల వెనుక చైనా ఒత్తిడి ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top