మరో అద్భుతం: ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌

Chenab Railway Bridge Ready For Unveiling In Jammu Kashmir - Sakshi

భారత రైల్వేలో మరో అద్భుత నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే  బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. చీనాబ్‌ నదిపై ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తయిన బ్రిడ్జ్‌ నిర్మితమవుతోంది. భారత ఇంజనీరింగ్‌ గొప్పదనాన్ని ఈ రైల్వే బ్రిడ్జ్‌ మకుటంగా నిలవనుంది. ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తయిందని మార్చ్‌లో ప్రారంభానికి సిద్ధమైందని కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్‌ ట్విటర్‌ వేదికగా చెప్పారు. కశ్మీర్‌ ప్రాంతానికి రైల్వే లైన్‌ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రైల్వే మార్గం వేస్తున్నారు.

జమ్మూ కశ్మీర్‌లోని కౌరీ ప్రాంతంలో ఉన్న చీనాబ్‌ నదిపై ఈ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కత్రా, బనిహాల్‌ ప్రాంతాలను ఈ బ్రిడ్జ్‌ కలపనుంది. కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 1,178 అడుగుల ఎత్తులో బాంబు పేలుళ్లు, భూకంపాలకు తట్టుకునేలా ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ 63 ఎంఎం పరిమాణంలో ఉన్న స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఈ బ్రిడ్జ్‌ పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కన్నా  మీటర్లు ఎక్కువ.

‘మౌలిక సదుపాయాల కల్పనలో అద్భుతం. చీనాబ్‌ నదిపై స్టీల్‌ బ్రిడ్జ్‌ భారత రైల్వే నిర్మాణంలో మరో మైలు రాయి కాబోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్‌ ప్రారంభానికి సిద్ధమైంది’ అని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు. ఉద్దంపూర్‌-శ్రీనగర్‌- బరాముల్లా రైల్వే మార్గం (111 కిలోమీటర్లు)లో ఈ బ్రిడ్జ్‌ నిర్మితమవుతోంది. కశ్మీర్‌ లోయ ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జ్‌ ఉపయోగపడనుంది. 

ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణం చేపడుతున్నారు. 2004లో 1.315 కిలోమీటర్ల ఈ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చీనాబ్‌ నది ప్రవాహానికి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రాడ్‌ గేజ్‌ రైల్వే లైన్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం చేపడుతున్నారు. గంటకు 90 కిలోల వేగంతో వీచే గాలులను కూడా ఈ బ్రిడ్జ్‌ తట్టుకుని నిలబడుతుంది. నిర్వహణకు సెన్సార్‌ ఏర్పాటుచేశారు. 120 ఏళ్ల వరకు ఈ బ్రిడ్జ్‌ చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు. దీని నిర్మాణ వ్యయం మొత్తం రూ.12,000 కోట్లు అని తెలుస్తోంది. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top