ఖాళీగా ఉన్న జడ్జి పోస్టుల భర్తీ ఎప్పుడు?

Centre offers to decide on High Court appointments in three months - Sakshi

కొలీజియం సిఫార్సులపై నిర్ణయం కోసం టైమ్‌ఫ్రేమ్‌ సిద్ధం చేయండి

కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం విషయంలో కొలీజియం చేసిన సిఫార్సులపై నిర్ణయం తీసుకొనేందుకు తగిన కాల వ్యవధిని(టైమ్‌ ఫ్రేమ్‌) సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం సూచించింది. మెమోరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌(ఎంఓపీ)లోని కాల వ్యవధికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని గుర్తుచేసింది. కొలీజియం 10 పేర్లను ప్రతిపాదించిందని, వీటిపై ప్రభుత్వం ఏడాదిన్నరగా నిర్ణయం తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ 10 పేర్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు.

హైకోర్టుల్లో జడ్జీల నియామకంపై నిర్ణయం తీసుకోవడానికి ఎంఓపీలో ప్రధానమంత్రికి గడువు ఏదీ నిర్దేశించలేదని గుర్తుచేశారు. పీఎంఓ నుంచి ఆదేశాలు రాగానే కొలీజియం ప్రతిపాదించిన పేర్లను రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామన్నారు. సుప్రీంకోర్టుకు 34 జడ్జీ పోస్టులను మంజూరు చేయగా, ప్రస్తుతం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హైకోర్టులకు 1,080 జడ్జీ పోస్టులను మంజూరు చేయగా, 416 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తుచేశారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారు. హైకోర్టుల్లో జడ్జీల పోస్టులను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top