మమతా బెనర్జీకి మరోసారి షాకిచ్చిన సీబీఐ.. ఎమ్మెల్యే అరెస్ట్‌

CBI Arrests TMC MLA Jiban Krishna Saha In Teacher Recruitment Scam - Sakshi

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్‌లో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో సీబీఐ విచారణలో భాగంగా టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్‌ కృష్ణ సాహాను అరెస్ట్‌ చేశారు. దీంతో, ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు టీఎంసీ నేతలు అరెస్ట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్ట్‌ ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. బెంగాల్‌లో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో బుర్వాన్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా నివాసాలపై సీబీఐ ప్రత్యేక బృందం దాడులు చేసింది. అనంతరం, జిబాన్‌ను సీబీఐ స్పెషల్‌ టీమ్‌ దాదాపు 65(ఏప్రిల్ 14 నుంచి దాదాపు మూడు రోజులు) గంటల పాటు విచారించింది. విచారణ తర్వాత.. జిబాన్ కృష్ణను అరెస్ట్‌ చేస్తున్నట్టు సీబీఐ స్పష్టం చేసింది. అయితే, విచారణ సందర్భంగా జిబాన్‌.. తమకు సహకరించలేదని అధికారులు తెలిపారు. 

అంతకుముందు.. కేంద్ర భద్రతా బలగాలతో పాటు సీబీఐ బృందం ముర్షిదాబాద్ జిల్లాలోని ఆయన నివాసానికి చేరుకుంది. అభ్యర్థుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో, ప్రభుత్వ పాఠశాలల్లో రెండు సెక్షన్ల రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్షల అడ్మిట్ కార్డులతో సహా అనేక నేరారోపణ పత్రాలను సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు. దీనికి సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, సీబీఐ దాడుల సందర్బంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఇంట్లో విచారణ సందర్భంగా, జిబాన్‌ వాష్‌రూమ్‌కు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. తరువాత అతను అకస్మాత్తుగా తన నివాసం పక్కనే ఉన్న చెరువు వైపునకు వెళ్లి తన ఫోన్లను అందులోకి విసిరేసాడు. దీంతో, అధికారులు షాకయ్యారు. 
ఇక, బెంగాల్‌లో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి షాక్‌ తగిలింది. టీఎంసీ నేతలు సాహా మాణిక్‌ భట్టాచార్య, పార్థా చటర్జీ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి మరో ఎమ్మెల్యే జిజాన్‌ కూడా చేరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top