బెంగాల్లో తృణమూల్, బీజేపీ నువ్వా నేనా? | How Bengal election turns Narendra Modi versus Mamata Banerjee | Sakshi
Sakshi News home page

మమతకు అగ్నిపరీక్షగా అసెంబ్లీ ఎన్నికలు

Mar 17 2026 3:44 PM | Updated on Mar 17 2026 4:29 PM

How Bengal election turns Narendra Modi versus Mamata Banerjee

తృణమూల్‌కు కీలక ప్రచారాస్త్రంగా ‘సర్‌’

పలుచోట్ల ఓటుబ్యాంకుకు గండి పడే చాన్స్‌

భయపెడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి 

హిందూత్వ, మోదీ కరిష్మాపై బీజేపీ ఆశలు

ఉనికి చాటుకోవాల్సిన స్థితిలో లెఫ్ట్, కాంగ్రెస్‌

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు మరోసారి దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఒకరకంగా చెప్పాలంటే ‘సర్‌’కు ముందు, తర్వాత అన్నట్టుగా పరిణమించాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ ప్రక్రియకు ముందు వరకూ సీఎం మమతా బెనర్జీయే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా వెలుగొందారు. కానీ ఓటర్ల జాబితా సవరణతో అధికార తృణమూల్‌ పార్టీ ఓటు బ్యాంకు భారీగా ప్రభావితమైనట్టు కన్పిస్తోంది. దాంతో ఈ ఎన్నికల్లో ‘సర్‌’ప్రక్రియనే ప్రధాన ప్రచారాంశంగా చేసుకోవాలని దీదీ నిర్ణయించారు! ‘సర్‌’సాకుతో బెంగాలీల అస్తిత్వంపైనే దెబ్బ కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. దాంతో సర్‌ ప్రక్రియ బెంగాల్‌ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసేలా కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర అంశాలు, సమస్యలు ఎన్నున్నా ఈసారి కూడా రాష్ట్రంలో ఎన్నికలు మరోసారి ‘మమత వర్సెస్‌ మోదీ’అన్నట్టుగానే జరగనున్నాయి.

ఇద్దరు పాపులర్‌ నేతల పోరులో అంతిమంగా పైచేయి సాధించేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ దూకుడుకు మరోసారి ముకుతాడేసి వరుసగా నాలుగోసారి విజయఢంకా మోగించాలని తృణమూల్‌ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యలు, పలు రంగాల్లో మమత సర్కారు వైఫల్యాలు తదితరాలను అస్త్రాలుగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2021 ఎన్నికల్లో తృణమూల్‌కు గట్టి పోటీ ఇచ్చి 77 సీట్లు కైవసం చేసుకున్న ఆ పార్టీ, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా చొచ్చుకుపోయి బెంగాల్‌పై తొలిసారిగా కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో సున్నా చుట్టి పూర్తిగా చతికిలపడ్డ లెఫ్ట్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.

పశ్చిమబెంగాల్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అధికార బీజేపీ, విపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మమత దూకుడుకు ముకుతాడేసి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా విజయఢంకా మోగించాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి బెంగాల్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. త్వరలో వారిద్దరూ రాష్ట్రంలో సుడిగాలి ప్రచారానికి తెర తీయనున్నారు. మోదీ కరిష్మా రాష్ట్రంలో ఈసారి అధికారం కట్టబెట్టడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. 15 ఏళ్లుగా సాగుతున్న తృణమూల్‌ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత బాగా కలిసొచ్చే అంశమన్నది ఆ పార్టీ భావన. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్న ప్రచారం కూడా తృణమూల్‌కు గట్టిగానే చేటుచేసేలా కన్పిస్తోంది.

ముఖ్యంగా మహిళలకు భద్రతే లేకుండా పోయిందంటూ బీజేపీ ఇప్పటికే హోరెత్తిస్తోంది. హిందూత్వవాదంపై కూడా కాషాయ పార్టీ గట్టిగానే నమ్మకం పెట్టుకుంది. తద్వారా ముస్లిమేతర ఓట్లు సంఘటితం అవుతాయని, పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటములను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. మొండితనానికి, పోరాటానికి మారుపేరైన దీదీ కూడా కాషాయ దళానికి దీటుగా ఎన్నికల వ్యూహరచన చేస్తోంది. సర్‌ ప్రక్రియను వ్యతిరేకించే క్రమంలో ఆమె ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లడం వంటివి కలిసొస్తాయని తృణమూల్‌ భావిస్తోంది. మమతకున్న ‘సామాన్యురాలి’ ఇమేజీపైనే మరోసారి నమ్మకం పెట్టుకుంది. అయితే మంత్రులు, నేతల అవినీతి బాగోతాలు అధికార పార్టీకి తీవ్రంగా చేటుచేసేలా కన్పిస్తున్నాయి. అవినీతి ఆరోపణల మచ్చను ఏ మేరకు చెరుపుకోగలదన్నది ఆసక్తికరం.

లెఫ్ట్, కాంగ్రెస్‌ నేల చూపులు 
1977 నుంచి 2011 దాకా బెంగాల్‌ను సుదీర్ఘంగా పాలించిన వామపక్ష కూటమి పరిస్థితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఓట్ల శాతం కేవలం 4.73కి పడిపోయిన పరిస్థితి! కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. లెఫ్ట్‌ ఫ్రంట్‌కు, హస్తం పార్టీకి గత ఎన్నికల్లో కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు! దాంతో అవి ఈసారి ఎంతోకొంత పుంజుకుని ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాయి.

బీజేపీకి ‘ఎల్పీజీ’దడ 
ఎన్నికలు సమీపించిన తరుణంలో పశ్చిమాసియా యుద్ధం బీజేపీకి అనుకోని సమస్య తెచ్చిపెట్టింది. నానాటికీ తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరత సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. పరిస్థితి తక్షణం చక్కబడకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రతికూలాంశంగా మారగలదని బీజేపీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. మరోవైపు మమతకు మాత్రం ఈ అంశం అనుకోకుండా అందివచ్చిన అస్త్రంగా మారేలా కనిపిస్తోంది. పోలింగ్‌కు మరో నెల రోజులున్నందున ఈలోపు సమస్యను మోదీ సర్కారు ఏ మేరకు చక్కదిద్దగలదన్నది చూడాల్సిందే.

కీలకంగా ‘సర్‌’ 
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ ప్రక్రియ బెంగాల్లో కీలక ఎన్నికల అంశంగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ఫలితంగా రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.44 కోట్లకు తగ్గింది. ఏకంగా 1.2 కోట్లకు పైగా ఓట్లు తొలగింపుకు గురవడంతో పలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకరణాలే అనూహ్యంగా తారుమారయ్యే పరిస్థతి నెలకొంది! ముఖ్యంగా 60 లక్షలకు పైగా ముస్లిం ఓట్ల తొలగింపు తృణమూల్‌ను గట్టిగా దెబ్బతీయనుంది.

రాజధాని కోల్‌కతాతో పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దాని ఓటు బ్యాంకు తగ్గడం బీజేపీకి లాభించేలా కన్పిస్తోంది. ఆయాచోట్ల తమ ఓట్లు భారీగా తొలగింపుకు గురైనట్టు తృణమూల్‌ ఇప్పటికే పలుమార్లు ఆరోపించింది. అందుకే సర్‌ ప్రక్రియను కీలక ప్రచారాస్త్రంగా మలచుకోవాలని మమత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాన్ని బెంగాలీల అస్తిత్వంపై కేంద్రం దాడిగా చిత్రిస్తున్నారు. సర్‌ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు విన్పించారామె! ఇది రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆమె ఇమేజీని మరింత పెంచిందని తృణమూల్‌ అంటోంది.

అయితే 24 పరగణాలు, నాదియా వంటి బంగ్లా సరిహద్దు జిల్లాల్లో బీజేపీ ఓటుబ్యాంకుకు కూడా సర్‌ ప్రక్రియ కొంతమేరకు గండి కొట్టింది. అక్కడ బీజేపీకి పట్టున్న మథువా, రాజ్‌బన్షీ సామాజిక వర్గాల ఓటర్లు భారీగా తొలగింపుకు గురయ్యారు. అయినా సరే, అక్రమ వలసదారుల ఓట్లతోనే మమత అధికారం చేపడుతూ వస్తున్నారని రాష్ట్ర బీజేపీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు.  

బీజేపీ సానుకూలతలు 
డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వ నినాదం 
మమత ప్రభుత్వంపై వ్యతిరేకత 
సర్‌ ప్రక్రియతో పలు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు అవకాశాలు మెరుగవడం 
టీచర్లు, ఆశా వర్కర్లు తదితరుల దన్ను 
ప్రతికూలతలు 
చరిష్మా ఉన్న నాయకుడు లేకపోవడం 
తృణమూల్‌తో పోలిస్తే క్షేత్రస్థాయిలో బలహీనం 
కేంద్ర నాయకత్వంపై ఆధారపడటం 
సర్‌ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం 
నానాటికీ తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరత

తృణమూల్‌ కాంగ్రెస్‌ సానుకూలతలు 
మమత పాపులారిటీ  
మహిళల్లో ఆదరణ 
క్షేత్రస్థాయిలో పార్టీకున్న పట్టు 
లక్ష్మీర్‌ బంధర్, స్వాస్థ్య సాథి, యువ సాథి వంటి పథకాలు 
సర్‌ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం 
ఎన్నికలను రాష్ట్రం వర్సెస్‌ కేంద్రంగా మలచడంలో విజయం 
ప్రతికూలతలు 
15 ఏళ్లుగా అధికారంలో ఉన్నందున తీవ్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత 
నేతలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు 
రాష్ట్రంలో పెచ్చరిల్లిన నేరాలు 
సర్‌ ప్రక్రియతో పలుచోట్ల ఓటు బ్యాంకుకు గండి  

Advertisement
 
Advertisement
Advertisement