సిట్టింగ్‌లకు టీఎంసీ షాక్‌ | West Bengal Election Debate: Mamata Banerjee Vs Suvendu Adhikari In Bhabanipur Seat | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌లకు టీఎంసీ షాక్‌

Mar 18 2026 4:54 AM | Updated on Mar 18 2026 4:54 AM

West Bengal Election Debate: Mamata Banerjee Vs Suvendu Adhikari In Bhabanipur Seat

74 మంది ఎమ్మెల్యేలకు నో టికెట్‌

ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకే అంటున్న విశ్లేషకులు

వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహం

భవానీపూర్‌లో సువేందుతో మమత ఢీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా భారీ మార్పులకు తెరతీసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకుగాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ మొత్తం ఎమ్మెల్యేల్లో మూడోవంతు మంది, 74 మందికి మొండి చేయి చూపింది. వరుసగా నాలుగోసారి అధికార పీఠం చేజిక్కించుకోవాలని లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ..ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లుగా భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితాను టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ కాళీఘాట్‌ నివాసంలో మంగళవారం విడుదల చేశారు. డార్జిలింగ్‌ హిల్స్‌లోని మిగతా మూడు స్థానాలను మిత్రపక్షమైన భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్‌ మోర్చాకు వదిలిపెట్టారు.

ముఖ్యంగా భవానీపూర్‌ నుంచి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారిని నేరుగా ఢీకొనబోతున్నారు. 2007లో టాటా కంపెనీ భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన మమతా బెనర్జీ చేపట్టిన ఉద్యమానికి కేంద్రస్థానంగా నందిగ్రామ్‌ ఉంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ మమతను సువేందు అధికారి 1,900 స్వల్ప ఓట్ల తేడాతో ఓడించారు. అనంతరం భవానీపూర్‌ నియోజ కవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మమత 58 వేల మెజారిటీతో గెలిచారు. తాజాగా, నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లోనూ బీజేపీ నేత సువేందు పోటీకి దిగుతుండటం తెల్సిందే. దీంతో వీరిద్దరూ మళ్లీభవానీపూర్‌ వేదికగా ఢీకొననున్నారు. టీఎంసీకి ప్రస్తుతమున్న 224 మంది ఎమ్మెల్యేలకు గాను 135 మందికి మళ్లీ టికెట్‌ దక్కింది. వీరిలో 15 మందికి మాత్రం సీట్లను మార్చారు. 74 మందికి మొండిచేయి చూపారు. జాబితాలో 52 మంది మహిళలతోపాటు పిర్హాద్‌ హకీం, అనూప్‌ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్య, తదితర మంత్రులు కూడా ఉన్నారు. 

బీజేపీ కోసమే ఈసీ బదిలీలు: మమత
అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం ప్రసంగించిన సీఎం మమత ఎన్నికల కమిషన్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ సహా పలువురు అధికారులను ఎన్నికల కమిషన్‌ ఉన్న ఫళంగా బదిలీ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈసీ ఈ బదిలీలన్నిటినీ కేంద్రంలోని బీజేపీ కోసమే చేసిందని ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో బదిలీల జాబితా తయారు కాగా, ఆ మేరకు ఈసీ అమలు పర్చిందని మమత విమర్శించారు. రాష్ట్రంలోకి బీజేపీ డబ్బు, ఆయుధాలను నిరాటంకంగా తరలించేందుకే బదిలీలు చేపట్టారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో బీజేపీకి సాయపడేలా రాష్ట్రం వెలుపలి నుంచి కూడా కొందరు అధికారులను తీసుకువచ్చారన్నారు. బీజేపీ తరపున తమాషా ఆట ఆడుతున్న ఈసీ నేరుగా బీజేపీ తరపునే ప్రచారం చేసుకోవచ్చు కదా అంటూ మమత ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement