afghanistan Crisis: తాలిబన్లు ఎలా గెలిచారంటే!

Bribery detailed in Afghans fall - Sakshi

కొంపముంచిన సైన్యంలో అవినీతి

బలాన్నిచ్చిన పాక్, ఐఎస్‌ఐ మద్దతు

ఇరవైఏళ్ల పాటు ఆధునిక పాశ్చాత్య బలగా ల శిక్షణ, అమెరికా, నాటో సేనలు అందించిన ఆయుధాలు, 3.5 లక్షలకు పైగా బలగం.. ఇన్ని ఉన్నా కనీస ప్రతిఘటన లేకుండా అఫ్గాన్‌ సేన తాలిబన్లకు తలొగ్గింది. తమ బలగాలు ఖాళీ చేసిన నెల రోజుల్లో దేశాన్ని తాలిబన్లు వశం చేసుకోవచ్చన్న అగ్రరాజ్యం అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 10 రోజుల్లో అఫ్గాన్‌ సైన్యం లొంగిపోయిన తీరు అందరినీ నివ్వెర పరుస్తోంది. ఎందుకిలా జరిగిందనే ప్రశ్నకు ముందుగా వినిపిస్తోన్న సమాధానం.. అవినీతి! ఇరవైఏళ్లుగా అఫ్గాన్‌ సైన్యంలో అవినీతి తారాపథానికి చేరింది.

సామాన్య సైనికుడి నుంచి అత్యున్నత అధికారి వరకు అంతా లంచాలు మరిగారు. ప్రపంచ దేశాలు ఇచ్చిన నిధులన్నీ అధికారులు దిగమింగి కూర్చున్నారు. దీంతో కీలక సమయంలో సైన్యమంతా చేతులెత్తేసింది. రెండు దశాబ్దాలు అఫ్గాన్‌లో ఉన్న పాశ్చాత్య సేనలు అఫ్గాన్‌లో అవినీతి చూసి విస్తుపోయారంటే అతిశయోక్తి కాదు. స్వయంగా ఆదేశ ఇనస్పెక్టర్‌ జనరలే తమ దేశ బలగాలకు లంచమనే కేన్సర్‌ రోగం పట్టిందని చెప్పినట్లు యూఎస్‌ కాంగ్రెస్‌ నివేదిక చెబుతోంది. అఫ్గాన్‌ సెక్యూరిటీకి దాదాపు 880 కోట్ల డాలర్లను యూఎస్, నాటో దళాలు వెచ్చించాయి. కానీ చివరకు ఇదంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

కీలక సమయంలో సాయం చేస్తుందనుకున్న అఫ్గాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కూడా చేతులెత్తింది. అఫ్గాన్‌ వైమానిక దళంలో దాదాపు 211 విమానాలున్నాయి. కానీ వీటిని నడిపేందుకు అవసర సిబ్బంది, వీరిని ప్రేరేపించే నాయకులు లేకుండా పోయారు. అందువల్ల కాబూల్‌లోకి తాలిబన్లు వస్తున్నా ఒక్క యుద్దవిమానం కూడా ఎదిరించలేదు. అవినీతితో పాటు అఫ్గాన్‌ సేనల్లో పిరికితనం పాలు ఎక్కువైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా తాలిబన్లతో జరిపిన పోరాటాల్లో చాలామంది గాయపడడం, వీరి స్థానంలో సరిపడ కొత్త సైన్యం భర్తీ కాకపోవడం కూడా ఓటమికి మరో కారణంగా చెప్పారు.

బయటి మద్దతు
కేవలం అఫ్గాన్‌ సేనల్లో అవినీతి మాత్రమే తాలిబన్ల విజయానికి కారణం కాదన్నది నిపుణుల మాట. ఒకప్పుడు తాలిబన్లను గట్టిగా వ్యతిరేకించిన స్థానిక తెగల నాయకులు, ప్రజలు ఈ దఫా తాలిబన్లకు సహకారం అందించారు. 2 దశాబ్దాలు అమెరికా ఆధ్వర్యంలో పాలన జరగడం చాలా తెగలకు నచ్చలేదు. దీంతో  వీరిని తాలిబన్లు తమవైపునకు తిప్పుకున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో తాలిబన్లు గట్టిగా పోరాడకముందే విజయం లభించింది.  తాలిబన్లకు పాక్‌ మద్దతుంది.. వీటికి యూఏఈ, ఖతార్, సౌదీ నుంచి వచ్చిన విరాళాలు, రష్యా, చైనాల పరోక్ష సహకారం, ఓపియం పంటతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరగడం తదితర కారణాలు తాలిబన్లకు గెలుపునందించాయి.  పాకిస్తాన్‌ గతంలోలా పీఓకే గుండా ఉగ్రతండాలను తాలిబన్‌ సహకారంతో భారత్‌లోకి పంపిస్తుందన్న ఆందోళనలు పెరిగాయి. 
 –నేషనల్‌ డెస్క్, సాక్షి  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top