‘ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయలేదు.. చట్టానికి అతీతులా?’

Bombay HC Asks Param Bir Singh Why No FIR Against Anil Deshmukh - Sakshi

పరంవీర్‌ సింగ్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన బాంబే హైకోర్టు

ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ ముంబై పోలీసు కమిషనర్‌ పరంవీర్‌ సింగ్‌పై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా.. సీబీఐ విచారణ కోరుతున్నారు మీరు చట్టానికి అతీతులా’’ అని ప్రశ్నించింది. అనిల్‌ దేశ్‌ముఖపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ పరంవీర్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు ‘‘ మీరు ఓ పోలీసు కమిషనర్‌. మీ కోసం చట్టాన్ని పక్కకు పెట్టాలా. మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసులు చట్టానికి అతీతులా.. మాకు ఏ చట్టాలు వర్తించవని మీ అభిప్రాయమా’’ అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

అంతేకాక ‘‘పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత స్థానంలో ఉండి.. 30 ఏళ్లకు పైగా ఈ నగరానికి సేవలందించిన మీలాంటి ఓ వ్యక్తి వద్ద నుంచి ఇలాంటి కఠిన నిజాలు వెలువడటం శోచనీయం. అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని మీరు కోరుతున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఎలాంటి విచారణ జరపలేం అనే విషయం మీకు తెలియదా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు. నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. అది మీ బాధ్యత కాదా’’ అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది

ముకేష్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలిగిన వాహనం కలకలం కేసుకు సంబంధించి పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్‌ పరంవీర్‌ సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ మహారాష్ట్ర హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరంవీర్‌ సింగ్‌ అనిల్‌ దేశ్‌ముఖ్‌ బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాలయు వసూలు చేయాలని వజేకు టార్గెట్‌ విధించాడని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించాడు. ఇందుకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశాడు. 

చదవండి: వాజే టార్గెట్‌ వంద కోట్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top