డాక్టర్ స్మార్ట్‌ స్కేల్స్‌! | Body scanners that assess overall physical health | Sakshi
Sakshi News home page

డాక్టర్ స్మార్ట్‌ స్కేల్స్‌!

Jun 7 2026 1:02 AM | Updated on Jun 7 2026 1:02 AM

Body scanners that assess overall physical health

ఇవి శరీర సమగ్ర ఆరోగ్యాన్ని అంచనా వేసే బాడీస్కానర్లు

శరీరం ద్వారా చిన్న విద్యుత్‌ తరంగంతో కచ్చితమైన రిపోర్ట్‌ 

ఒకేదాన్ని కుటుంబ సభ్యులందరూ వాడుకునే అవకాశం 

ఎవరి వివరాలు వారికే... వ్యక్తిగత మొబైల్‌కు డేటా

కేవలం బరువును బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని చెప్పలేము. ఒకే బరువు ఉన్న ఇద్దరిలో ఒకరు ఫిట్‌గా, మరొకరు అన్‌ఫిట్‌గా ఉండవచ్చు. అందుకే, కేవలం బరువునే కాకుండా శరీర సమగ్ర ఆరోగ్యాన్ని అంచనా వేసే స్మార్ట్‌ స్కేల్స్‌ (బాడీ స్కానర్లు) ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బి.ఐ.ఎ. టెక్నాలజీతో పనిచేస్తాయి.

అందించే ఆరోగ్య వివరాలు 
బాడీ ఫ్యాట్‌ పర్సంటేజ్‌: బరువు తగ్గడం కంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గడమే ముఖ్యం. ఈ స్కేల్‌ మీ శరీరంలో కొవ్వు శాతం ఎంతో కచ్చితంగా చెబుతుంది.

బాడీ వాటర్‌ పర్సంటేజ్‌: శరీరం ఎంతవరకు హైడ్రేటెడ్‌గా (నీటి శాతం) ఉందో చూపిస్తుంది.

మెటబాలిక్‌ ఏజ్‌: మీ శరీరం లోపల ఎంత యాక్టివ్‌గా ఉందో మీ అసలు వయసుతో పోల్చి చెప్తుంది. (ఉదాహరణకు: మీ వయసు 30 ఏళ్లయితే, బాడీ మెటబాలిజం 25 ఏళ్ల యువకుడిలా ఉందా లేదా 40 ఏళ్ల వ్యక్తిగా ఉందా అనేది చెబుతుంది).

విసెరల్‌ ఫ్యాట్‌: గుండె, కాలేయం వంటి అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే అత్యంత ప్రమాదకరమైన కొవ్వు ఇది. దీని స్థాయిని బి.ఐ.ఎ. ద్వారా తెలుసుకుని, గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించవచ్చు.

ఎముకల సాంద్రత: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

మజిల్‌ వర్సెస్‌ ఫ్యాట్‌: కొవ్వు శరీరాన్ని లావుగా చూపిస్తే, కండరాలు ఫిట్‌గా ఉంచుతాయి. సాధారణ బరువు మిషన్లలో ఈ తేడా తెలియదు, కానీ స్మార్ట్‌ స్కేల్‌ ఈ రెండింటి బరువును విడివిడిగా చూపిస్తుంది.  

బి.ఐ.ఎ. అంటే ఏమిటి? 
బయోఎలక్ట్రికల్‌ ఇంపిడెన్స్‌ అనాలిసిస్‌కి సంక్షిప్త రూపమే బి.ఐ.ఎ.ఈ స్మార్ట్‌ స్కేల్‌పై నిలబడినప్పుడు, మనకు తెలియకుండానే ఒక చిన్న విద్యుత్‌ తరంగం శరీరం ద్వారా వెళ్తుంది. ఇది శరీరంలోని కొవ్వు, కండరాలు, నీటి శాతాన్ని బట్టి వేర్వేరు వేగంతో ప్రయాణించి, కచ్చితమైన బాడీ రిపోర్ట్‌ను లెక్కిస్తుంది.

ఇంటిల్లిపాదికీ ఒకటే స్కేల్‌: ఒకే స్మార్ట్‌ స్కేల్‌ను కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు. స్కేల్‌పై ఎవరు నిలబడ్డారో వారి బాడీ ప్రొఫైల్‌ను బట్టి ఆటోమేటిక్‌గా గుర్తించి, వారి వ్యక్తిగత మొబైల్‌ యాప్‌కే డేటాను పంపుతుంది. ఒకరి డేటా మరొకరికి కలవదు.

Advertisement
 
Advertisement
Advertisement