Jammu and Kashmir: ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే పేలుడు

Blast Heard in Jammu Village ahead of PM Modis visit to Union Territory - Sakshi

జమ్మూ: జమ్ముకశ్మీర్‌లో ప్రధాని పర్యటనకు కొన్నిగంటల ముందు సభావేదికకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. జమ్ము జిల్లాలోని లాలియాన గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక పొలంలో పేలుడు చోటు చేసుకొంది. ప్రధాని బహిరంగ సభ జరగనున్న సాంబా జిల్లాలోని పల్లీ గ్రామానికి ఇది సమీపంలోనే ఉంటుంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

జమ్మూ-కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్మూ-కశ్మీర్‌లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. సుంజ్వాన్‌ ప్రాంతంలో మొన్న ఇద్దరు జైషే-మహమ్మద్‌ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్‌ఐఏ అధిపతి కుల్‌దీప్‌ సింగ్‌ సుంజ్వాన్‌ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి కూడా చేరుకొని అక్కడి భద్రతా పరిస్థితినీ సమీక్షించారు.

చదవండి: (ఏప్రిల్‌ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top