రాజస్థాన్ కార్యకర్తలకు బీజేపీ ట్రైనింగ్‌.. 2023 ఎన్నికలే లక్ష్యం!

BJP plans 3 day camp in Rajasthan With eyes on Rajasthan polls next year - Sakshi

జైపుర్‌: దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జులై 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూలో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. 

రానున్న ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ క్యాంప్‌కు హాజరయ్యే జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల వ్యూహాలను వివరించనున్నారు. బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ శిబిరం ప్రారంభానికి ఒక రోజు ముందే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ జైపుర్‌ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ట్రైనింగ్‌ క్యాంప్‌ అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మకు మద్దతు తెలిపిన హిందూ వ్యక్తి హత్యకు గురైన విషయం, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై ఈ భేటీలో చర్చించనున్నారు. 

శిక్షణ శిబిరానికి వచ్చే నేతలెవరు?
రాజస్థాన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించి ట్రైనింగ్‌ క్యాంప్‌కు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వీ సతీశ్‌, బీఎల్‌ సంతోష్‌, రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు సతీశ్‌ పూనియా, కేంద్ర మంత్రులు.. కైలాశ్‌ చౌదరి, అరుణ్‌ రామ్‌ మెఘ్వాల్‌, గజేంద్ర సింగ్‌ శేఖావత్‌, ప్రతిపక్ష నేత గులాబ్‌ చంద్‌ కటారియా, మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజే సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

చదవండి: మేడమ్‌ టుస్సాడ్స్‌ నుంచి రోడ్డుపైకి బోరిస్‌ మైనపు విగ్రహం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top