‘ఆయన కోరిక కాదన్నందుకే ఈ‌ కేసులో ఇరికించారు’

BJP Pamela Goswami Alleges Rakesh Singh Framed Her Drugs Case - Sakshi

బీజేపీ నేతపై ఆ పార్టీ మహిళా నాయకురాలి సంచలన ఆరోపణలు

కోల్‌కతా: డ్రగ్స్‌తో పట్టుబడిన పశ్చిమ బెంగాల్‌ బీజేపీ యూత్‌ వింగ్‌ లీడర్‌ పమేలా గోస్వామి, ఆ పార్టీ సీనియర్‌ నేత రాకేశ్‌ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అందుకు తాను ధీటుగా బదులివ్వడంతో ఇలా కుట్ర పన్ని తనను ఇరికించారని ఆరోపించారు. నిజం ఎక్కువ రోజులు దాగదని, తాను చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. కాగా పమేలా గోస్వామి, తన స్నేహితుడితో కలిసి కోల్‌కతాలోని నయా అలీపూర్‌ ప్రాంతంలోని ఎన్‌ఆర్‌ అవెన్యూకు వెళ్తున్న సమయంలో పోలీసులు ఆమె కారును తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 100 గ్రాముల కొకెన్‌ లభించడంతో అక్కడిక్కడే పోలీసులు పమేలాను అరెస్టు చేశారు. 

ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీ అనంతరం ఎన్‌డీపీఎస్‌ కోర్టు ఎదుట గురువారం ఆమెను హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలతో కోర్టు బయటకు వచ్చిన పమేలా గోస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరో చేసిన కుట్ర కారణంగా నేను బాధితురాలిగా మారాను. రాకేశ్‌ సింగ్‌ నిజంగా ఏ తప్పు చేయకపోయి ఉంటే ఎందుకు పారిపోయారు? ఈ కథ వెనుక ఉన్న అసలు నిజం ఏమిటంటే.. రాకేశ్‌ సింగ్‌ నా పట్ల ఆసక్తి కనబరిచారు. కానీ నేను ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఆయనకు కోపం వచ్చి ఇలా నన్ను ఇరికించారు. అంతేకాదు గతంలో నన్ను శారీరకంగా వేధించారు. 

ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే నన్ను బెదిరింపులకు గురిచేశారు. నా ముఖంపై యాసిడ్‌ పోస్తానని హెచ్చరించారు. మా వాళ్లను చంపుతానని బెదిరించారు’’అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏదో ఒక విధంగా ఇబ్బంది కలిగిస్తారనుకున్నా గానీ ఇలా డ్రగ్స్‌కేసులో ఇరికిస్తారని అనుకోలేదు అని పమేలా వాపోయారు. ఇదిలా ఉంటే.. మమతా బెనర్జీ సర్కారు కక్షపూరిత చర్యల్లో భాగంగా పమేలాను ఇరికించి ఉంటుందంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

చదవండిడ్రగ్స్‌తో పట్టుబడిన బీజేపీ నాయకురాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top