
జూలై 21 నాటికి అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తి చేసే యోచనలో బీజేపీ
ఆలోగానే తెలంగాణ, ఏపీ, యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికను వచ్చే నెల జరుగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ముగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 21న పార్లమెంట్ సమావేశాలు ఆరంభమయ్యే ముందునాటికే జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసేలా ఎన్నికల ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించాలని పార్టీ యోచిస్తోంది.
ఆగస్టు 15 నుంచి బిహార్ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాల దృష్ట్యా, కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పదేపదే వాయిదా పడుతూ వస్తుంది. మే నెలలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావించినా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. అధ్యక్ష బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లపైనా పరిశీలనలు ఇప్పటికే పూర్తయ్యాయి.
ప్రధాన పోటీదారుల జాబితాలో కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్‌లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్, జి.కిషన్‌రెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ నేతలు సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లో బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబర్‌లోగా ఎన్డీఏ కూటమి పక్షాలతో సీట్ల పంపకాలు, పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ఓ అవగాహనకు రావాల్సి ఉంది. ఇది జరగాలంటే ఆగస్టు నుంచే బిహార్ ఎన్నికలపై ఆగస్టు నుంచే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాల్సి ఉంది.
అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరుగనున్నాయి. పార్టీ కీలక నేతంలతా సమావేశాల్లో బిజీగా ఉండే నేపథ్యంలో, సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చే యాలని, అలా అయితేనే ఆయన సారథ్యంలో బిహార్ ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చనే భావనలో పార్టీ ఉంది. దీనికై ఈ నెల చివరి వారంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంది. పార్టీ నియమావళి ప్రకారం జాతీయ అధ్యక్షుడి ప్రకటనకు ముందే సగానికి పైగా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది.
ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటిì చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. వీరిని త్వరలోనే ప్రకటించే దిశగా ఇప్పటికే కీలక చర్చలు ముగిశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి ప్రకటన ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయితే ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మూడేళ్ల కాలంలో యూపీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాలతో పాటు మొత్తంగా 12 రాష్ట్రాల ఎన్నికలు ఈయన సారధ్యంలోనే జరుగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సైతం కొత్త అధ్యక్షుడి హాయంలోనే ఉండనున్నాయి.