
రేసులో స్వతంత్రదేవ్ సింగ్, ధరంపాల్ సింగ్, బీఎల్ వర్మ, సాధ్వి నిరంజన్ జ్యోతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి, అధ్యక్షులను నియమించిన బీజేపీ అధిష్టానం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు అతిత్వరలో శ్రీకారం చుట్టబోతోంది. మరో పది రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా.. అంతకంటే ముందే ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. బీజేపీకి ఆయువు పట్టులాంటి ఉత్తర్‌ప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనంతరమే చేపట్టే అవకాశం ఉన్నట్లు సమచారం. ఉత్తరప్రదేశ్‌కు ఉన్న రాజకీయ ప్రాధాన్యత వల్ల అధ్యక్షుడి ఎంపికలో ఆచితూచి వ్చవహరించాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
2027 ఎన్నికలే లక్ష్యంగా..
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బీజేపీకి జాట్ వర్గానికి చెందిన భూపేంద్రసింగ్ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023లోనే ఆయన పదవీకాలం ముగిసినా 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పొడిగించారు. లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను బీజేపీ కేవలం 33 స్థానాలు గెలుచుకుంది. పార్టీ పేలవ ప్రదర్శన దృష్ట్యా ఆయనను మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మొగ్గు చూపుతున్నాయి.
ప్రస్తుతం యూపీలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీల చుట్టే రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. బీజేపీ సైతం ఆయా వర్గాల నుంచి సమర్థులైన నేతలను అన్వేషిస్తోంది. ఓబీసీ వర్గానికి చెందిన స్వతంత్రదేవ్ సింగ్, ధరంపాల్ సింగ్, బీఎల్ వర్మలు ప్రధాన పోటీదారులుగా ఉండగా, కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, సీనియర్ నేతలు బాబూరామ్ నిషాద్, అశోక్ కటారియాలు సైతం రేసులో ఉన్నారు.
యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా ఆయన సారథ్యంలోనే 2027లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. క్రమంగా బలపడుతున్న సమాజ్‌వాదీ పార్టీ, దానికి అండగా ఉన్న కాంగ్రెస్‌ను ఎదిరించాలంటే బీజేపీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడి ఎంపిక సాధ్యం కాదని, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే ఈ ప్రక్రియ మొదలవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సైతం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే కొత్త అధ్యక్షుడి వస్తారని అంటున్నారు. ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా నేతృత్వంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకే మళ్లీ పగ్గాలు కట్టబెడతారా? లేక కొత్త వారికి అవకావం ఇస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.