Bird Flu In Maharshtra: బర్డ్‌ ఫ్లూ కలకలం.. వేల సంఖ్యలో కోళ్లను చంపాలని కలెక్టర్‌ ఆదేశం

Bird Flu Cases Detected In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం ప్రజలను, అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో బర్డ్‌ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. బర్డ్‌ ఫ్లూ కారణంగా  షాహాపూర్‌లోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి.

దీంతో అప్రమత్తమైన అధికారులు చనిపోయిన కోళ్లకు సంబంధించిన నమూనాలను పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. ఇదిలా ఉండగా.. H5N1 ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా కారణంగానే అ‍క్కడ కోళ్లు చనిపోయినట్టు థానే జడ్పీ సీఈవో డా. బహుసాహెబ్‌ దంగ్డే తెలిపారు. ఈ క్రమంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి కట్టడి కోసం అధికారులు రంగంలోకి దిగారు. సదరు పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లతో సహా.. ఆ కోళ్ల ఫారమ్‌కు కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లోని దాదాపు 25,000 కోళ్లను చంపేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

అయితే, బర్డ్‌ ఫ్లూ వెలుగులోకి రావడంతో థానే సరిహద్దు జిల్లాల్లోని అధికారులు అప‍్రమత్తమయ్యారు. అక్కడ పౌల్ట్రీ ఫామ్‌ల్లోని కోళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫామ్‌ల నిర్వాహకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దాదాపుగా ప్రతీ ఏటా దేశంలో ఏదో ఒక చోట బర్డ్‌ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, బర్డ్‌ ఫ్లూ కారణంగా గతేడాది జూలైలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఓ బాలుడు(12) చనిపోయాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top