నీట్‌ పోర్టల్‌లో మరో కలకలం | Bihar teen hacks NEET aspirants accounts on portal, diverts money in refund scam | Sakshi
Sakshi News home page

నీట్‌ పోర్టల్‌లో మరో కలకలం

Jun 15 2026 9:29 PM | Updated on Jun 16 2026 11:01 AM

Bihar teen hacks NEET aspirants accounts on portal, diverts money in refund scam

న్యూఢిల్లీ: నీట్ (NEET-UG) పరీక్ష నిర్వహణలో ఇప్పటికే ప్రశ్నపత్రం లీకేజీ వివాదంతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో మరోసారి కలకలం రేగింది. నీట్ అధికారిక పోర్టల్‌లోకి అక్రమంగా చొరబడిన 19 ఏళ్ల యువకుడు నవీన్ యాదవ్‌ 150 మంది అభ్యర్థులకు చెల్లించాల్సిన రీఫండ్ మొత్తాలను తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. అహ్మదాబాద్ పోలీసులు నిందితుణ్ని బిహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

గత నెలలో నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయకుండా, ఇప్పటికే చెల్లించిన ఫీజులో భాగంగా రీఫండ్ అందించేందుకు ఎన్‌టీఏ ప్రత్యేక రీఫండ్ మాడ్యూల్‌ను ప్రారంభించింది.

ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇదే ప్రక్రియను లక్ష్యంగా చేసుకున్న నవీన్ యాదవ్, పోర్టల్‌లోని భద్రతా లోపాలు,బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి విద్యార్థుల ఖాతాల్లోకి చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల దర్యాప్తులో బిహార్‌ గయా జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ సుమారు 350 మంది అభ్యర్థుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని, వారిలో 150 మందికిపైగా ఖాతాల్లోకి విజయవంతంగా ప్రవేశించాడు. ఇందుకోసం బ్రూట్ ఫోర్స్ అటాక్ పద్ధతిని ఉపయోగించాడు. అంటే పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను ఊహిస్తూ అన్ని సాధ్యమైన కాంబినేషన్లను వరుసగా ప్రయత్నించడం. అలా పాస్‌వర్డ్‌లను గుర్తించిన అనంతరం నిందితుడు విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాల స్థానంలో తన ఖాతా వివరాలను నమోదు చేశాడు. దీంతో ఒక్కో అభ్యర్థికి చెల్లించాల్సిన రూ.1,700 రీఫండ్ మొత్తం అతని ఖాతాలో జమైంది.

ఎన్‌టీఏ పోర్టల్‌లో నగదు లావాదేవీల్లో అవకతవకలు జరగడంతో అధికారులు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రీఫండ్ లావాదేవీల్లో అసాధారణ మార్పులు గుర్తించారు. అనంతరం ఎన్‌టీఏ నుంచి బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించి డబ్బు బదిలీలను ట్రాక్ చేసి నిందితుడిని బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘల్ మాట్లాడుతూ.. పోర్టల్‌లోని భద్రతా లోపాలను నిందితుడు సద్వినియోగం చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం అతను ఇతర సైబర్ నేరాల్లో కూడా పాల్గొన్నాడా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు.

నీట్‌ అభ్యర్థులకు చుక్కలు  
ఇదిలా ఉండగా, జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్ సరిగా పనిచేయకపోవడంతో దేశవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అడ్మిట్ కార్డుల విడుదల ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం ఉదయం నాటికి కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్‌పై అధిక భారం కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొంది.

ఈ సమస్యల పరిష్కారానికి తమ సాంకేతిక బృందం నిరంతరం పనిచేస్తోందని, అతి త్వరలో అన్ని అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌టీఏ తన అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement