మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్‌

Bihar Govt Encourage Women Makes Glass Bangles From Liquor Bottles - Sakshi

పట్నా: బిహార్‌లో ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడుతోంది. దీంతో స్వాధీనం చేసుకున్న బాటిళ్లను పారవేయడంలో తరుచుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని బిహార్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి సునీల్‌ కుమార్‌ అన్నారు. ఈ మద్యం బాటిళ్లను మట్టిని తొలగించే ఎర్త్‌ మూవర్‌ మిషన్‌లతో చితక్కొట్టడం వల్ల భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అందుకని ఈ వ్యర్థాలను తగ్గించేలా జీవనోపాధిని ఇచ్చేలా బిహార్‌ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

అదే మద్యం బాటిళ్లతో గాజుల తయారీ. ఈ గాజుల తయారీని 'జీవిక పథకానికి' చెందిన మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒక తయారీ యూనిట్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు బిహార్‌ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రోహిబేషన్‌ శాఖ అందుకోసం దాదాపు కోటి రూపాయాల మొత్తాన్ని మంజూరు చేసింది.

దీంతో ప్రోహిబేషన్‌ శాఖ గాజుల తరయారీ ముడి సరుకు కోసం జీవనోపాది కార్మికులను నియమించుకుంటుంది.  ఆ కార్మికులకు పగిలిన మద్యం బాటిళ్ల పొడిని అందజేస్తారు. ఆ జీవనోపాది కార్మికులు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గాజులు తయారు చేయడంలో శిక్షణ పొందుతారు.  తొలుత తయారీ యూనిట్ల సంఖ్య పరిమితంగా ఉంటుందని రానున్న నెలల్లో మరింతగా పెంచుతామని ప్రోహిబేషన్‌ శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఇది ఒక కుటీర పరిశ్రమలా పనిచేస్తుందన్నారు.

అంతేకాదు దీన్ని మరింతగా విస్తరించగలమా లేదా అనే దానిపై నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో పేదరిక నిర్మూలన చేయడమే 'జీవిక పథకం' లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్‌ కుమార్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, ముఖ్యంగా మహిళలకు మరింత ఉపాధిని కల్పించడమే ఈ పథకం లక్ష్యం అని చెప్పారు. ఈ ప్రాజెక్టును పట్నాలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి బీహార్‌లో ఏప్రిల్ 2016లో మద్యం నిషేధించబడింది. దీనితో పాటు, మద్యం నిల్వ, వినియోగం, అమ్మకం, తయారీ వంటివి శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top