మత ఘర్షణలపై సీఎం నితీశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Bihar CM Nitish Kumar Sensational Comments On Communal Clashes - Sakshi

పాట్నా: తాజా మత ఘర్షణల మీద బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఘర్షణలను ప్రతీ వర్గం  పక్కనపెట్టాలని, అసలు దేవుడి ప్రార్థనలకు హింసతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

శ్రీ రామ నవమి సందర్భంగా దేశంలో పలు చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిపై స్పందించాల్సిందిగా మీడియా.. సోమవారం సీఎం నితీశ్‌కుమార్‌ను కోరింది. 

‘‘వర్గాల మధ్య శాంతి, సామరస్యం వెల్లివిరియాలి. దేవుళ్లను ఆరాధించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతేగానీ మనలో మనం కొట్టుకోవడం కాదు. పూజించడం మీద అంత నమ్మకం ఉంటే.. సరిగ్గా పూజలు చేసుకోవాలి. అంతేగానీ పూజల పేరుతో ఘర్షణలకు పాల్పడడం ఏంటి? ప్రార్థనలకు హింసకు ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటివి బీహార్‌లో జరిగితే ఊరుకునేదే లేదు’’ అని సీఎం నితీశ్‌ కామెంట్‌ చేశారు. 

మరోవైపు మసీదుల వద్ద ఆజాన్, లౌడ్ స్పీకర్ల చుట్టూ వివాదాలు సృష్టిస్తున్న వారికి మతంతో సంబంధం లేదని, ప్రజలు తమ మతాన్ని అనుసరించాలని, వారిని అడ్డుకోవద్దని నితీష్ కుమార్ అన్నారు. ప్రతి మతానికి దాని స్వంత మార్గాలు ఉన్నాయి. దీని గురించి మనలో మనం గొడవ పడకూడదు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించాలి. ఎవరైనా ఈ విషయాలపై వివాదాలు సృష్టిస్తే, అతనికి మతంతో సంబంధం లేదు అని అన్నారాయన.

ఇదిలా ఉండగా.. రామ నవమి సందర్భంగా రాళ్లు రువ్విన వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలంటూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారడంతో పాటు సుప్రీం కోర్టుకు చేరాయి. ఈ తరుణంలో బీజేపీ మిత్రపక్షం హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా చీఫ్‌, బీహార్‌ మాజీ సీఎం జతిన్‌ రామ్‌ మాంఝీ.. శ్రీ రాముడిపై ప్రతికూల కామెంట్లు చేయగా, ఇప్పుడు మరో మిత్రపక్ష నేత, సీఎం నితీశ్‌ సైతం పూజల పేరుతో అల్లర్లకు పాల్పడుతున్న వాళ్లపై విమర్శలు గుప్పించడం గమనార్హం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top