జేడీయూ 122.. బీజేపీ 121

Bihar Assembly Election 2020 JDU 122 And BJP 121 - Sakshi

బిహార్‌ అధికార పక్షంలో కుదిరిన సీట్ల ఒప్పందం 

నితీశ్‌ నాయకత్వంలోనే ముందుకు సాగుతామన్న బీజేపీ 

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూల మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. 243 స్థానాలకుగాను 122 సీట్లలో జేడీయూ, 121 స్థానాల్లో బీజేపీ పోటీ పడనున్నాయి. ఈ సందర్భంగా జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నాయకత్వానికి బీజేపీ మద్దతు తెలిపింది. సీఎం అభ్యర్థి నితీశ్‌ అని తెలిపింది. జేడీయూ తన వాటాకు వచ్చిన 122 సీట్లలో ఏడు స్థానాలను మాజీ సీఎం జతిన్‌రామ్‌ మాంఝీ నాయకత్వంలోని హిందుస్తానీ ఆవామీ మోర్చా(హెచ్‌ఏఎం)కు కేటాయించింది. బీజేపీకి కేటాయించిన 121 స్థానాల్లో కొత్తగా కూటమిలో చేరిన ముకేశ్‌సాహ్నికి చెందిన వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీకి కొన్ని సీట్లు కేటాయిస్తారని నితీశ్‌ తెలిపారు.

‘లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) కేంద్రంలో మా భాగస్వామి. ఆ పార్టీ నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. బిహార్‌కు సంబంధించినంత వరకు ఇక్కడ ఎన్డీఏ నాయకుడు నితీశ్‌ కుమారే. మా బంధం బలంగా ఉంది’ అని బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే.. ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తి ఉంటారా? అన్న మీడియా ప్రశ్నకు..  ‘కాబోయే ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది అప్రస్తుతం’ అని ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ తేల్చిచెప్పారు. ఎల్జేపీ నేత చిరాగ్‌పాశ్వాన్‌ విమర్శలపై నితీశ్‌ కుమార్‌ పరోక్షంగా స్పందించారు.

‘నా పని నేను చేస్తాను. అర్థంలేని విమర్శలతో ఎవరైనా సంతోషం పొందితే.. అది వారిష్టం’ అని వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలతో జేడీయూ సరిగ్గా వ్యవహరించదన్న విమర్శలపై.. ‘జేడీయూ మద్దతు లేకుండానే రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం సీట్ల పంపకంపై  బీజేపీ, జేడీయూ నేతలు ఒక అవగాహనకు వచ్చారు. ఆ తరువాత రెండు పార్టీల అగ్రనేతలు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున చర్చల్లో పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దేవేంద్ర ఫడణవిస్, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, సంజయ్‌ జైశ్వాల్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ సీనియర్‌ నేత, సంఘ్‌పరివార్‌తో సన్నిహిత సంబంధాలున్న రాజేంద్ర సింగ్‌ మంగళవారం ఎల్జేపీలో చేరారు.  

బీజేపీ తొలి జాబితా 
27 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆదివారం పార్టీలో చేరిన అంతర్జాతీయ షూటర్‌ శ్రేయసి సింగ్, మాజీ ఎంపీ హరి మాంఝీ తదితరులు ఆ జాబితాలో ఉన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top