‘‘నితీశ్ కుమార్‌కు వయసు పైబడిపోయింది. ఆయన ఆరోగ్యమూ బాగోలేదు. ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జనాల్లో తిరిగే ఓపిక ఆయనకు ఉండడం లేదు. ఇక ఆయనకు విశ్రాంతి అవసరం. పైగా ఆయనకు అధికారంపైనే తప్ప ప్రజలపై మమకారం లేదు. బిహార్‌కు ఇప్పుడు కొత్త తరహా ఆలోచనలు అవసరం.’’.. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వినిపించిన విమర్శలు ఇవి. అయితే ఆ విమర్శలకు ఆయన గ్రాండ్ విక్టరీతోనే చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారు.
నితీశ్ పాలనతో బిహారీలు విసిగిపోయారని.. అందుకే ఆయన్ని తప్పించాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ వేరుగా ర్యాలీలు నిర్వహించమే అందుకు నిదర్శనమని.. రాజకీయ ప్రచారం విస్తృతంగా సాగింది ఎన్నికల ప్రచారం సమయంలో. అయితే ఇలాంటి ప్రచారాలను, తనపై వచ్చిన విమర్శలను నితీశ్ కుమార్ ఏనాడూ తిప్పి కొట్టింది లేదు. అయితే..
74 ఏళ్ల వయసులో ప్రచారంలో చురుకుగా పాల్గొనడం ద్వారా హుందాగా ఆయన వాళ్ల నోళ్లు మూయించారు. టైగర్ అబీ జిందా హై(పులి పని ఇంకా అయిపోలేదు).. తనను తక్కువ అంచనా వేయొద్దంటూ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ వచ్చారు. అంతేకాదు.. ప్రజలే నిజమైన తీర్పు ఇస్తారంటూ ఓ వ్యాఖ్య చేశారు.
అదే సమయంలో.. బీజేపీ వ్యవహారంలోనూ ఆయన ట్రిగ్ అయిన దాఖలాలు కనిపించలేదు. అందుకు కారణం లేకపోలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన సీట్లు 43. బీజేపీ కంటే 31 సీట్లు తక్కువే. అయినప్పటికీ ప్రాంతీయత, అనుభవం పేరిట నితీశ్‌కుమార్‌కే సీఎం పగ్గాలు అప్పగించింది బీజేపీ. ఆ తర్వాత బీజేపీకి కటీఫ్ చెప్పినా.. మళ్లీ కొంతకాలానికి జట్టు కట్టి సీఎం అయ్యారు.
ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీతో ఆయన స్నేహపూర్వకంగా మెదులుతూ వచ్చారు. బీజేపీ చివరిదాకా నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించపోయినా ఆయన నొచ్చుకోలేదు. ఈలోపు.. ఇటు బిహార్ ఓటర్లు మహాఘట్ బంధన్‌లో కీచులాటను సునిశితంగా గమనించారు. చివరకు సుదీర్ఘ నాయకత్వాన్ని గౌరవమిస్తూ ‘సుశాసన్ బాబు’కే ఓటు వేశారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 80 సీట్లు గెల్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు డబుల్ ఫలితం. తద్వారా పదో సారి ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ప్రమాణం చేయబోతున్నారు. అయితే.. JD(U) విజయానికి నితీశ్ కుమార్ తిప్పిన రాజకీయ చక్రం ప్రధాన శక్తిగా ఉన్నా.. పార్టీకి చెందిన ఇతర నేతలు, ఎన్డీయే భాగస్వాములు, సామాజిక సమీకరణలు, యువతకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా విజయానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు.


