పాట్న: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌లో(Bihar Assembly Election) కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేడీయూలోని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ మంత్రులు సహా 16 మంది నేతలపై పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) బహిష్కరణ వేటు వేశారు. ఎన్డీయే అధికారిక అభ్యర్థులకు పోటీగా ఎన్నికల బరిలో నిలిచినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. వీరు జేడీయూ సిద్ధాంతాలను ఉల్లంఘించడంతోపాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.
భాగల్పూర్ జిల్లా గోపాల్‌పూర్ ఎమ్మెల్యే నరేంద్ర నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ ఇటీవల తనకు వరుసగా ఐదో విడత టికెట్ ఇవ్వలేదని సీఎం కార్యాలయం వద్ద నిరసనకు దిగి, వార్తల్లోకి ఎక్కారు. అంతకుమునుపు, జేడీయూకే చెందిన ఎంపీ అజయ్ మండల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో, పార్టీ టికెట్ మరొకరికి కేటాయించింది. ఈ నేపథ్యంలో గోపాల్ మండల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈయనతోపాటు ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ తరఫున గయా జిల్లా గురువా స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, కటిహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి హిమ్‌రాజ్ సింగ్ వేటు పడిన వారిలో ఉన్నారు. అధికార పార్టీ రెండు రోజుల వ్యవధిలో 16 మందిపై బహిష్కరణ వేటు వేసింది.
ఇదిలా ఉండగా.. 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్ (Bihar News)లో ఎన్డీయే కూటమిలో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. వచ్చే నెల 6న, 11న రెండు విడతల్లో పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


