Bhopal Gas Tragedy: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Bhopal Gas Tragedy: Big Setback For Centre In Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: దాదాపు 40 ఏళ్లనాటి భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన కేసులోని బాధితులకు పరిహారం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్‌ ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ నుంచి అదనపు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

గ్యాస్‌ లీక్‌ బాధితులకు అదనపు పరిహారంగా రూ. 7,844 కోట్లు ఇప్పటించాలని అమెరికాకు చెందిన యూనియన్‌ కార్భైడ్‌  కార్పొరేషన్‌ కంపెనీలను ఆదేశించాలని కోరుతూ కేంద్రం 2010లో క్యూరేటివ్‌ పిటిషిన్‌ దాఖలు చేసింది. 1989లో సెటిల్మెంట్‌ సమయంలో ప్రజల జీవితాలకు, పర్యావరణానికి జరిగిన వాస్తవ నష్టాలను సరిగా అంచనా వేయలేమని చెబుతూ.. ఈ కేసును రీ ఓపెన్‌ చేయాలని కేంద్రం కోరింది. 

దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సంజీవ్ ఖ‌న్నా, అభ‌య్ ఓకా, విక్ర‌మ్‌నాథ్‌, జేకే మ‌హేశ్వ‌రిల‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. కేవలం మోసం కారణంగా మాత్రమే సెటిల్‌మెట్‌ను పక్కన పెట్టవచ్చని.. అయితే  ఈ అశంపై కేంద్రం వాదించలేదని పేర్కొంది. అంతేగాక రెండు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను లేవనెత్తడానికి ఎలాంటి హేతుబద్ధత అందించనందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సంతృప్తి చెందలేదు కోర్టు పేర్కొంది.

యునియ‌న్ కార్బైడ్ సంస్థ‌పై అద‌న‌పు భారాన్ని విధించ‌డం స‌రికాదని, ఆ కేసును రీఓపెన్ చేయ‌డం వ‌ల్ల మ‌రిన్ని స‌మ‌స్య‌ల్ని సృష్టించ‌డ‌మే అవుతుంద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. భోపాల్‌ గ్యాస్‌ బాధితులకు ఇప్పటికే ఆరుసార్లు నష్టపరిహారాన్ని ఇచ్చారని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న రూ. 50 కోట్ల మొత్తాన్ని పెండింగ్‌లో ఉన్న పరిహారం క్లెయిమ్‌లను క్లియర్ చేయడానికి ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం వేసిన క్యూరేటివ్ పిటిష‌న్‌పై జ‌న‌వ‌రి 12వ తేదీన సుప్రీం త‌న తీర్పును రిజ‌ర్వ్ చేయగా.. నేడు తిరస్కరించింది.

కాగా డిసెంబర్ 2,1984న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 3,000 మందికి పైగా మరణించారు. లక్ష మందికి పైగా ప్రభావితమయ్యారు. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా దీనిని పరిగణించారు. యూనియన్‌ కార్బైడ్‌ను సొంతం చేసుకున్న ప్రస్తుతం డౌ కెమికల్స్‌ 1989లో సెటిల్‌మెంట్‌ కింద రూ. 715 కోట్ల హరిహారం చెల్లించింది.

అప్పటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ ఆండర్సన్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ విచారణకు హాజరు కాలేదు. 1992లో భోపాల్ కోర్టు అతను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. 2014లో ఆయన మరణానికి ముందు రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. అయితే  జూన్ 7, 2010న భోపాల్ కోర్టు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెట్‌కు చెందిన ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 
చదవండి: 'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి'

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top