యోగి, ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు చెప్పమని ఏటీఎస్‌ బెదిరించింది

ATS forced me to take names of Yogi and RSS Leaders - Sakshi

ముంబై: పేలుడు కేసులో నలుగురు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ పేర్లను చెప్పమని ముంబై ఏటీఎస్‌ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌) తనను బెదిరించిందని 2008 మాలేగాం పేలుడు కేసులో సాక్షి మంగళవారం కోర్టుకు చెప్పారు. నాడు ఆ కేసును ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న పరమ్‌బీర్‌ సింగ్‌ పర్యవేక్షించారు. నాడు సదరు సాక్షి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. అయితే హఠాత్తుగా తనను బెదిరించి పేర్లు చెప్పించారని సాక్షి కోర్టుకు చెప్పడం కలకలం రేపింది. కేసుపై ఎన్‌ఐఏ కోర్టు విచారణ జరుపుతోంది. పరమ్‌బీర్‌ సహా మరో అధికారి యోగి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల పేర్లను చెప్పమని బెదిరించారని తాజా విచారణలో సాక్షి కోర్టుకు విన్నవించారు.

తనను ఏటీఎస్‌ హింసిందన్నారు. దీంతో సాక్షి ఏటీఎస్‌ ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అంగీకరించమని కోర్టు ప్రకటించింది. ఇంతవరకు ఈ కేసులో 220 సాక్షులను విచారించారు. వీరిలో 15మంది అడ్డం తిరిగారు. ఈ నేపథ్యంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మన్మోహన్, సోనియా గాంధీ, రాహుల్, సల్మాన్‌ఖుర్షిద్, ప్రియాంక క్షమాపణలు చెప్పాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. యూపీఏ హయాంలో రాజకీయ కుట్రతో ఈ కేసును రిజిస్టర్‌ చేశారన్నారు. కాంగ్రెస్‌ కుట్రలను తనను బెదిరించారన్న సాక్షి స్టేట్‌మెంట్‌ బహిర్గతం చేసిందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇతర ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్‌కు వత్తాసు పలికాయని విమర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top