
అసోసియేట్ ప్రొఫెసర్ అరెస్టు
సోనిపట్ (హరియాణా): ఆపరేషన్ సిందూర్‌పై అశోకా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి అలీ ఖాన్ మహ్ముదాబాద్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు వివాదాస్పదంగా మారాయి. హరియాణా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా, మరొకరి ఫిర్యాదు మేరకు ఆయనపై రెండు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించారంటూ ఆదివారం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.
ప్రొఫెసర్ ఖాన్‌కు నోటీసులు కూడా ఇవ్వకుండానే అరెస్టు చేశారని ఆయన లాయర్ చెప్పారు. ప్రొఫెసర్ ఖాన్ మహిళా ఆర్మీ అధికారులను అవమానించేలా ఈ నెల 7న పోస్టులు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ పేర్కొంది. ‘‘కల్నల్ సోఫియా ఖురేషీని ప్రశంసిస్తున్న మితవాదులు మూక హత్యల బాధితులకు, బుల్‌డోజర్లతో ధ్వంసమయ్యే ఆస్తులకు రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేయాలి. ఆపరేషన్ సిందూర్ విషయంలో కల్నల్ ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వెల్లడించిన వివరాలు క్షేత్రస్థాయిలో కని్పంచాలి. లేదంటే వంచనే అవుతుంది’’ అని వాటిలో పేర్కొన్నట్టు తెలిపింది.
దీన్ని సుమోటోగా స్వీకరించి మే 12న ఖాన్‌కు నోటీసులిచ్చింది. తన వ్యాఖ్యలను కమిషన్ తప్పుగా అర్థం చేసుకుందని, పరిధిని అతిక్రమించి జోక్యం చేసుకుందని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఆయన అరెస్ట్‌ను విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఒక బీజేపీ కార్యకర్త ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారా అని మజ్లిస్ నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆయన పోస్టులో దేశానికి, మహిళలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు లేవన్నారు. అలీఖాన్ అరెస్ట్‌పై కోర్టుకు వెళ్తామని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ టీచర్ల సంఘం కూడా ప్రొఫెసర్ అరెస్ట్‌ను ఖండించింది.