Ashok Gehlot Vs Sachin Pilot: Sachin Pilot Camp Are Hopeful That He Will Become Next CM Of Rajasthan - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్‌ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది?

Published Sat, Apr 15 2023 5:34 AM

Ashok Gehlot vs Sachin Pilot: Sachin Pilot camp are hopeful that he will become the next Chief Minister of Rajasthan - Sakshi

ఎస్‌.రాజమహేంద్రారెడ్డి

సచిన్‌ పైలట్‌కు హఠాత్తుగా కోపం వచ్చింది. నాలుగున్నరేళ్లుగా లోలోపల రగిలిపోతున్న అసంతృప్తిని ఒకే ఒక్క చర్యతో బలంగా బహిర్గతం చేశారు. ఎంత బలంగా అంటే, కాంగ్రెస్‌ అధిష్టానం కంగుతినేంతగా! రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ ఉక్కిరిబిక్కిరయ్యేంతగా! మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె అవినీతిపై విచారణకు ఆదేశించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ గహ్లోత్‌ తీరును బాహాటంగానే దుయ్యబట్టిన పైలట్‌ ఈ నెల 11న ఏకంగా ఒక రోజు నిరసన దీక్షకు కూడా కూర్చున్నారు! అధిష్టానం హెచ్చరించినా, బుజ్జగించినా ఆయన ససేమిరా అన్నారు. దీన్ని ఏమీ పట్టించుకోనట్టుగా గహ్లోత్‌ పైకి గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

స్వపక్షీయుడే అయిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన పైలట్‌ ప్రతిపక్షంలా తనపైనే దాడికి దిగడం గహ్లోత్‌కు అసలు మింగుడు పడలేదు. ఎవరేమనుకున్నా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యాన్ని పైలట్‌ కాస్త గట్టిగానే వినిపించారు. ఒకవిధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారన్నమాట! సీఎం పదవిపై ఉన్న కాంక్షను వెలిబుచ్చడం ఒకటైతే, ప్రస్తుత ముఖ్యమంత్రి గహ్లోత్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని వేలెత్తిచూపడంరెండోది. అంతా బాగుందనుకున్న రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో ఇది సరికొత్త ముసలం...!

► గహ్లోత్‌–పైలట్‌ తలనొప్పిని ఎలా పరిష్కరించాలో తెలియక కాంగ్రెస్‌ అధిష్టానం తలపట్టుకు కూర్చుంది. ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో ఆరితేరిన కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సైతం ఎవరినీ ఏమీ అనలేక, మధ్యేమార్గంగా ‘మేజర్‌ సర్జరీ’తో వివాదం సద్దుమణిగేలా చేస్తామన్నారు. అయితే ఆ శస్త్రచికిత్స ఎప్పుడు, ఎలా అన్నది మాత్రం దాటవేశారు. బహుశా సోనియా, రాహుల్‌గాంధీల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టుంది.

పైలట్‌లో ఈ రీతిన అసంతృప్తి పేరుకుపోవడానికి అధిష్టానం వైఖరే కారణం. రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా 2018లో పార్టీని విజయపథాన నడిపించిన పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్టే పెట్టి, గహ్లోత్‌ చాణక్యానికి తలవంచడం అసంతృప్తిని రాజేసింది. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆనందం ఆవిరవకుండా పైలట్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారు. సందర్భాన్ని బట్టి అప్పట్లో ఆ పదవితో పైలట్‌ సంతృప్తి పడినట్టు కనిపించినా రెండేళ్లు తిరిగేసరికి తనను తాను సర్దిబుచ్చుకోలేక రాజీనామా చేసి అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా దీక్షకు దిగి గహ్లోత్‌తోనూ, అధిష్టానంతోనూ అమీతుమీకే సిద్ధమయ్యానన్న సంకేతాలను పంపగలిగారు.

క్రమశిక్షణ చర్యలు తప్పవని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఎస్‌.ఎస్‌.రణ్‌ధవా నేరుగానే హెచ్చరించారు. అయితే పైలట్‌ మాత్రం ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. ఈసారి సీఎం పదవి చేజారితే మరో ఐదున్నరేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన భయం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ గహ్లోత్‌నే సీఎంగా చూడటం పైలట్‌కు సుతరామూ ఇష్టం లేదు.

మరోవైపు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతున్న రాజస్తాన్‌ పడవ వివాదాల సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోవడం కాంగ్రెస్‌ అధిష్టానానికి రుచించడం లేదు. గహ్లోత్‌ను మళ్లీ సీఎం పదవి నుంచి తప్పించడానికి అధిష్టానం విముఖంగా ఉంది. ఎన్నికల ముందు సీఎంను మార్చి ఓటర్లను గందరగోళంలో పడేయడం తప్పుడు సంకేతాలను పంపినట్టవుతుందని భావిస్తోంది. గహ్లోత్‌పై పైలట్‌ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చడం కూడా కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టం లేదు.

పంజాబ్‌లో సిద్ధూ ఉదంతం అక్కడి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నిచ్చిందో కాంగ్రెస్‌కు అనుభవమే కాబట్టి మరోసారి అదే తప్పును పునరావృతం చేయడానికి సాహసించడం లేదు. అయితే ఈ సాకులన్నీ తనను మోసగించడానికేనని పైలట్‌ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అంతర్గత పోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం గమనార్హం. ఇప్పటికిప్పుడు బీజేపీ పరిస్థితి అమాంతం మెరుగయ్యేలా లేకపోయినా కులం కార్డు తమకు ఈసారి లాభిస్తుందని కమలనాథుల ఆశ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ జోషి (బ్రాహ్మణ్‌), బీజేపీ పక్ష నాయకుడిగా రాథోడ్‌ (రాజ్‌పుత్‌), ఉప నాయకుడిగా సతీశ్‌ పునియా (జాట్‌)లను నియమించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

పథకాలను నమ్ముకున్న గహ్లోత్‌
2018 నుంచి ఇప్పటిదాకా తను ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు 2023లో మరోసారి విజయం అందిస్తాయని గహ్లోత్‌ దృఢంగా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా ఇతర నాయకులతో తనకున్న సత్సంబంధాలు కూడా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తున్నారు. ఇటీవలే వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక అడుగు ముందుకేసి గహ్లోత్‌ గుణగణాలను ప్రశంసించడం గమనార్హం.

అయితే మరో ఆరేడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే గహ్లోత్‌–పైలట్‌ తమ విభేదాలను పక్కన పెట్టి సామరస్యంగా పనులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఇదే కోరుకుంటోంది. కానీ వారు బహిరంగంగానే సై అంటే సై అనుకోవడం కాంగ్రెస్‌పై ఓటర్లకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. వివాదాలను తెగేదాకా లాగడం కాంగ్రెస్‌ అధిష్టానానికి అలవాటుగా మారింది. సెప్టెంబరులోనే అధికార మార్పిడికి ఒకసారి విఫలయత్నం చేసి చేతులెత్తేసిన గాంధీలు మరోసారి అలాంటి సాహసానికి దిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఖర్గే కూడా గాంధీల మార్గంలోనే పయనిస్తున్నారు.

ఉన్నపళంగా పైలట్‌ను సీఎం చేసే దుస్సాహసానికి ఒడిగట్టే స్థితిలో ఆయన కూడా లేరు. పైలట్‌ కూడా ఇప్పటికిప్పుడు సీఎం పీఠం అధిష్టించాలన్న ఆలోచనలో లేరు. తాను వచ్చే ప్రభుత్వానికి ‘పైలట్‌’ కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. 2020లో తిరుగుబాటు చేసినప్పుడు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో పైలట్‌ విఫలమై ఉన్న డిప్యూటీ సీఎం పదవి కూడా వదులుకున్నారాయన. ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యం మరోసారి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షునిగా ఎంపికై తన మద్దతుదార్లకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడం ఒక్కటే! అదీ అధిష్టానం అనుకూలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ తాజా దీక్షతో ఆ అవకాశం కూడా పైలట్‌ చేజారినట్టు కన్పిస్తోంది!

ఇక పైలట్‌కు మిగిలింది...
► చిన్న పార్టీలైన హనుమాన్‌ బెనీవాల్‌ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీలతో జతకట్టి స్వతంత్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం.
► సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించి భావసారూప్యం గలవారిని చేర్చుకోవడం.
► పైలట్‌ గుజ్జర్‌ వర్గానికి చెందిన వారు కాబట్టి గుజ్జర్ల ఓట్లతో గెలవగలిగిన మొత్తం 30 అసెంబ్లీ సీట్లపైనా పూర్తిగా పట్టు బిగించడం.
► ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం. అయితే రాజకీయాల్లో తనకన్నా జూనియర్‌ అయిన కేజ్రీవాల్‌తో కూడటం ఆయనకు రుచించకపోవచ్చు.
► కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాటం కొనసాగిస్తూనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం.  


కొసమెరుపు..
    రాజస్తాన్‌ ప్రభుత్వాన్ని పైలట్‌గా ముందుండి నడిపించాలన్న సచిన్‌ ఆశ నెరవేరుతుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కాంగ్రెస్‌ గనక ఈసారి ఆయన లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే 2013లో వచ్చిన 21 సీట్లు కూడా రాకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. అంటే సచిన్‌ కాస్త కష్టపడితే రాష్ట్రానికి ‘పైలట్‌’ అవుతారనే కదా!!

Advertisement
Advertisement