అరుణ్‌ పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు

Arun Pillai ED custody extension - Sakshi

కీలకవ్యక్తికి నోటీసులు ఇవ్వగానే ఈయన మాట మార్చారు 

బుచ్చిబాబుతో కలిసి విచారించాలి 

ప్రత్యేక కోర్టుకి విన్నవించిన ఈడీ న్యాయవాదులు 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్‌ వ్యాపారవేత్త అరుణ్‌ పిళ్లై ఈడీ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వికాస్‌ ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫున న్యాయవాదులు నవీన్‌కుమార్, జొహబ్‌ హొస్సైన్‌ వాదనలు వినిపిస్తూ సౌత్‌గ్రూపులో కీలక వ్యక్తికి నోటీసులు జారీ చేయగానే తన వాంగ్మూలం ఉపసంహరణ పిటిషన్‌ దాఖలు దాఖలు చేశారని పరోక్షంగా కవితకు నోటీసులు జారీ అయిన తదుపరి ఇలా జరిగిందని ధర్మాసనానికి వివరించారు.

సీసీ టీవీ సమక్షంలోనే పిళ్లైను విచారించామన్నారు. కేసు కీలక దశలో ఉందని ఆడిటర్‌ బుచ్చిబాబుతో కలిసి పిళ్లైని విచారించాల్సి ఉన్న కారణంగా కస్టడీని పొడిగించాలని కోరారు. మద్యం పాలసీ ముసాయిదా ఫోన్‌లోకి రావడం, హోటల్‌ సమావేశాలపై సౌత్‌గ్రూపులోని వారిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. తనని టార్చర్‌ చేశారని పిళ్లై ఆరోపిస్తున్నారని ఒకవేళ అలా చేస్తే మరో 12 సార్లు స్టేట్‌మెంట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. విచారణ తర్వాతే పిళ్లై స్టేట్‌మెంట్లు రూఢీ చేసుకున్నామన్నారు. ఈడీ వాదనలతో పిళ్లై న్యాయవాదులు విభేదించారు. అనంతరం ఈ నెల 16 వరకూ పిళ్లైని ఈడీ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు.

ఈ నెల 15న విచారణకు రావాలని ఆడిటర్‌ బుచ్చిబాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో 9న విచారణకు రావాలని కోరగా బుచ్చిబాబు 13న వస్తానని అంగీకరించారని అయితే పిళ్లై ను కోర్టులో హాజరు పరచాల్సి ఉండడంతో తేదీ మార్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 15న íపిళ్లై, బుచ్చిబాబులను కలిపి ఈడీ విచారించనుండగా 16న విచారణకు రావాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు గత విచారణ సమయంలో ఈడీ స్పష్టం చేసిన విషయం విదితమే.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top