అయోధ్య రామాలయం రెడీ | Arrangements For Opening Ceremony Of Ayodhya Ram Temple | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం రెడీ

Published Fri, Dec 8 2023 6:45 PM | Last Updated on Sat, Jan 20 2024 4:12 PM

Arrangements For Opening Ceremony Of Ayodhya Ram Temple - Sakshi

దేవతలు నిర్మించిన పవిత్ర నగరం. సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కింది అంతస్తు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇందులోనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే  శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తన్నారు. ఇంతకీ ప్రస్తుతం అయోధ్య రామమందిర నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది ? జనవరి 22న జరిగే కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ? 

2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజుగా మారనుంది. అయోధ్య రామ మందిర్ దర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువులకు శుభవార్త అందింది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది.

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు.

ఆ జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు.. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి  లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే  పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా దాదాపుగా 8వేల మందికి ఈ ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు.

అయితే రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు.. ఇందుకోసం కర్ణాటక, రాజస్థాన్‌ల నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలను తయారుచేశారు.. ఈ విగ్రహాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనున్నారు. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ తయారు చేసింది.

ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు  చివరి దశలో ఉంది. మరోవైపు ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని  సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్‌లో మార్బుల్‌ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. కాగా అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది.

ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. ఇక జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా.. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక చరిత్ర విషయానికొస్తే.. దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు - రామ మందిరం వివాదం 2019 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది.సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు 2020 ఆగస్ట్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాద్‌లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్‌ ఆధారంగా రామమందిర నిర్మాణం చేపట్టారు.

ఆ తరువాత ఆ డిజైన్ కు 2020లో కొన్ని మార్పులు చేశారు. జనవరి 22న వచ్చే భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాటు చేసేందుకు అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. మాజా గుప్తర్‌ ఘాట్‌ వద్ద 20 ఎకరాల్లో 25 వేల మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు. బ్రహ్మకుండ్‌ వద్ద 30 వేల మందికి.. బాగ్‌ బిజేసీ వద్ద 25 వేల మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్‌సేవక్‌ పురం, మణిరాం దాస్‌ కంటోన్మెంట్‌ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవశ్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు.

ఇదీ చదవండి: అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement