PM Narendra Modi: భారీ ప్లాన్‌ అనగానే భయపడొద్దు | Sakshi
Sakshi News home page

PM Narendra Modi: భారీ ప్లాన్‌ అనగానే భయపడొద్దు

Published Tue, Apr 16 2024 4:44 AM

ANI Interview: PM Narendra Modi reveals his six-step plan for first 100 days - Sakshi

జాతి సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు

నా ధ్యాసంతా 2047 విజన్‌ మీదే

అభివృద్ధితో దేశాన్ని పరుగులు పెట్టిస్తా

అందరూ కొత్త సంకల్పంతో ముందడుగు వేయాలి

ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించిన ప్రధాని

న్యూఢిల్లీ: భారత్‌ కోసం బృహత్‌ ప్రణాళికలు ప్రకటించిన ప్రతిసారీ భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన క్షణాన దేశవ్యాప్తంగా జనంలో ఒకింత ఆందోళన, పాత నోట్ల మార్పిడిపై భయాలు నెలకొన్న ఘటనను ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఏఎన్‌ఐ వార్తాసంస్థతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.

‘‘ పెద్ద ప్రణాళిక ఉంది అన్నంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఎవరినీ ఆందోళనకు గురిచేసేలా నా నిర్ణయాలు ఉండవు. దేశ సమగ్రాభివృద్దే లక్ష్యంగా నా నిర్ణయాలుంటాయి. సాధారణంగా ప్రజా సంక్షేమం కోసం అంతా చేశామని ప్రభుత్వాలు ప్రకటించుకుంటాయి. అంతా నేనే చేశానంటే నమ్మను. సవ్యపథంలో ప్రజాసంక్షేమానికి శాయశక్తులా కృషిచేస్తా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా దేశం సాధించాల్సింది ఇంకా ఉంది. ప్రతి కుటుంబం కలను నెరవేర్చేది ఎలాగ అనేదే నా ఆలోచన. అందుకే గత పదేళ్లలో చేసింది ట్రైలర్‌ మాత్రమే అంటున్నా’’ అని మోదీ చెప్పారు.

100 రోజుల ప్లాన్‌ ముందే సిద్ధం
‘‘ నా ధ్యాసంతా 2047 విజన్‌ మీదే. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలుగా పనిచేసిన అనభవం ఉంది. ఆ రోజుల్లో ఎన్నికలొచ్చినపుడు ఓ 40 మంది సీనియర్‌ ఉన్నతాధికారులు ఎన్నికల పర్యవేక్షక విధుల్లోకి వెళ్లిపోయేవారు. అలా దాదాపు 50 రోజులు కీలక అధికారులు లేకుండా రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి అనేదే సమస్యగా ఉండేది. తరచూ ఎన్నికలు జరిగే దేశంలో ఇలాంటి సమస్యలు అనివార్యం. వాళ్లు లేని ఆ 50 రోజులు నాకు విరామం ఇచ్చినట్లు కాదని నిర్ణయించుకున్నా.

పూర్తిచేయాల్సిన పనులను ముందే వాళ్లకు పురమాయించేవాడిని. రాబోయే ప్రభుత్వం కోసమే ఈ పనులు చేయండని ఆదేశించేవాడిని. అలా 100 రోజుల ముందస్తు ప్రణాళిక పద్ధతి ఆనాడే అలవాటైంది నాకు. అదే మాదిరి ఇప్పుడూ మూడోసారి ప్రధాని అయితే తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికలను ముందే సిద్ధంచేసి పెట్టుకున్నా. 2047 వికసిత భారత్‌ కోసం చేయాల్సిన పనులపై గత రెండు సంవత్సరాలుగా కస రత్తు చేస్తున్నాం’’ అని మోదీ వెల్లడించారు.

విఫల కాంగ్రెస్‌కు, సఫల కమలానికి పోటీ
‘‘ వైఫల్యాల కాంగ్రెస్‌ విధానానికి, అభివృద్ధిని సాకారం చేసిన బీజేపీ విధానాలకు మధ్య పోటీ ఈ ఎన్నికలు. కాంగ్రెస్‌ ఐదారు దశాబ్దాలు పాలించింది. మాకు ఈ పదేళ్లే పనిచేసే అవకాశమొచ్చింది. అందులోనూ కోవిడ్‌ వల్ల రెండేళ్లకాలాన్ని కోల్పోయాం. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో కనిపిస్తున్న అభివృద్ధిని, నాటి కాంగ్రెస్, నేటి ఎన్‌డీఏ పాలనతో పోల్చి చూడండి. అభివృద్ది విస్తృతి, వేగాన్ని లెక్కలోకి తీసుకుని ఓటరు ఎటువైపు నిలబడాలో తేల్చుకోవాల్సిన తరుణమిది.

వచ్చే ఐదేళ్లకాలంలో అభివృద్ధిని పరుగుపెట్టిస్తాం. దేశాన్ని పాలించే బాధ్యతలు మనకు అప్పగించినప్పుడు ఒక్కటే లక్ష్యం కళ్ల ముందు కదలాడుతుంది. అదే దేశ ప్రజల అభ్యున్నతి’’ అని మోదీ అన్నారు. గాంధీల కుటుంబంపై మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ ఒక్క కుటుంబ ప్రయోజనాలే పరమావధిగా నాడు రాజకీయ సంస్కృతి కొనసాగింది. కుటుంబ పునాదులు కదలకుండా అంతా కాపుగాశారు. దేశ పునాదులను పటిష్టపరిచే సదుద్దేశంతో పనిచేస్తున్నా. నిజాయితీతో మేం చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి’’ అని అన్నారు.

తొలి 100 రోజుల్లో చేసినవే అవి..
‘‘2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే 100 రోజుల ప్లాన్‌ సిద్దంచేశాం. గెలిచి రాగానే ఒక్క నిమిషం కూడా వృథాచేయకుండా వాటి అమ లుపై దృష్టిపెట్టా. 2019లో గెలిచిన 100 రోజుల్లోపే ఆర్టికల్‌ 370ని రద్దుచేశా. ట్రిపుల్‌ తలాఖ్‌ను రద్దుచే యడంతో ముస్లిం సోదరీమణులకు స్వేచ్ఛ లభించింది. ఇది కూడా తొలి 100 రోజుల్లోనే అమలుచేశా. విశ్వాసమనేది కొండంత బలాన్ని ఇస్తుంది. భారతీయులు నా మీద పెట్టుకున్న నమ్మకం నాపై వాళ్లు ఉంచిన బాధ్యతగా భావిస్తా. భరతమాత ముద్దుబిడ్డగా నేను చేస్తున్న సేవ ఇది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.  

20 లక్షల మంది నుంచి సలహాలు
‘వచ్చే పాతికేళ్లలో దేశం ఎలాంటి అభివృద్ధి దిశలో పయనిస్తే బాగుంటుందో చెప్పాలని లక్షలాది మందిని సలహాలు అడిగా. వారి నుంచి సూచనలు స్వీకరించా. విశ్వవిద్యాలయాలు, వేర్వేరు రంగాల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు ఇలా దాదాపు 15–20 లక్షల మంది నుంచి సలహాలు తీసుకున్నా. కృత్రిమ మేథ సాయంతో సలహాలను రంగాలవారీగా విభజించా.

ప్రతి మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్‌లో అంకితభావంతో పనిచేసే అధికారులకు ఈ పని అప్పగించా. ఈసారి ఐదేళ్ల ఎన్‌డీఏ హయాంలో చేయగలిగిన అభివృద్ధి ఎంత అని బేరీజువేసుకున్నా. 2047నాటికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. ఇలాంటి మైలురాయిని చేరుకున్నపుడు గ్రామమైనా, దేశమైనా కొత్త సంకల్పంతో ముందడుగు వేయాలి. నా గ్రామనికి నేనే పెద్ద అయినపుడు 2047కల్లా సొంతూరుకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటాను కదా. దేశవ్యాప్తంగా ఇలాంటి స్ఫూర్తి రగలాలి. వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు అనేవి ప్రతి ఒక్కరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయి’’ అని మోదీ అన్నారు.

Advertisement
 
Advertisement