నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వండి

Allow Me To Take Decisions Or Else says Navjot Singh Sidhu To Congress - Sakshi

లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు

అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ పంజాబ్‌ చీఫ్‌ సిద్ధూ వ్యాఖ్య

న్యూఢిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో సిద్ధూ– అమరీందర్‌ సింగ్‌ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నాయకత్వంలోనే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని కాంగ్రెస్‌ పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి హరీశ్‌ రావత్‌ స్పష్టంచేయడంతో పార్టీ రాష్ట్ర చీఫ్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నిరసన స్వరం మరింత పెంచారు. ఒక రాష్ట్ర విభాగానికి అధ్యక్ష హోదాలో తనను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోనివ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సిద్ధూ వ్యాఖ్యానించారు.

కీలు బొమ్మలాగా, కేవలం ప్రదర్శనకు ఉంచిన ఒక వస్తువులాగా ఉండిపోదల్చుకోలేదని ఆయన అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతిని తగ్గించేందుకు సీఎం అమరీందర్‌ గురువారం పరోక్షంగా బల ప్రదర్శన చేశారు. గురువారం చండీగఢ్‌లో క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్‌సింగ్‌ ఇంట్లో జరిగిన విందు కార్యక్రమానికి దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారు. ఇది మంత్రుల భేటీగా వార్తలొచ్చినా.. సీఎం పరోక్షంగా బలప్రదర్శన చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిద్ధూ దీటుగా స్పందించారు.

పార్టీ నియమ నిబంధనలకు లోబడి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు పార్టీ రాష్ట్ర విభాగాల అధ్యక్షులు ఉందని కాంగ్రెస్‌ గతంలోనే ప్రకటించిందని సిద్ధూ గుర్తుచేశారు. శుక్రవారం అమృత్‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దూ మాట్లాడారు. ‘నన్నూ నిర్ణయాలు తీసుకోనివ్వండి. అలా అయితేనే పార్టీ మరో 20 ఏళ్లుపాటు అధికారంలోనే ఉండేలా చేస్తా. ఇందుకు ప్రణాళికలు సైతం సిద్ధంచేశా. నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వకుంటే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సిద్ధూ ధిక్కార స్వరంతో మాట్లాడారు.

ఇన్‌చార్జ్‌గా తప్పించండి: హరీశ్‌ రావత్‌
సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అక్కడ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధ్యక్షునిగా బిజీగా ఉంటానని, అందుకే పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తనను తప్పిస్తే బాగుంటుందని హరీశ్‌ రావత్‌  అన్నారు. తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చి పార్టీ చీఫ్‌ సోనియాగాంధీతో ఈ విషయమై చర్చించారు. ‘ఇంతకాలం పంజాబ్‌ వ్యవహారాలు చూశా. ఇకపైనా చూడమంటే చూస్తా. అధిష్టానానిదే తుది నిర్ణయం’ అని రావత్‌ వ్యాఖ్యానించారు. సిద్ధూ వ్యాఖ్యలపైనా రావత్‌ స్పందించారు. ‘సిద్ధూ ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నారో కనుక్కుంటా. రాష్ట్ర అధ్యక్షులది నిర్ణయాత్మక పాత్ర కానపుడు ఇంకెవరి నిర్ణయాలను అమలుచేస్తారు? ’ అని రావత్‌ అన్నారు. మరోవైపు, కశ్మీర్, పాక్‌ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ  సలహాదారు మల్వీందర్‌ సింగ్‌ ఇకపై ఆ పదవిలో కొనసాగబోనని చెప్పారు. సలహాలు ఇవ్వడం ఆపేస్తే మంచిదని రావత్‌ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం మల్వీందర్‌ తప్పుకోవడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top