ఏఐతో.. ముప్పు పొంచి ఉంది! | AI Going to Remove Jobs | Sakshi
Sakshi News home page

ఏఐతో.. ముప్పు పొంచి ఉంది!

Jul 18 2025 1:20 AM | Updated on Jul 18 2025 1:30 AM

AI Going to Remove Jobs

ఉద్యోగాలకు ప్రమాదం ఉందంటున్న నిపుణులు

నైపుణ్యాలు పెంచుకునేందుకు ‘అప్‌స్కిల్లింగ్‌’ బాట

ఆరు నెలల్లోపు కెరీర్‌ ప్రోగ్రామ్స్‌పై అత్యధికుల ఆసక్తి

ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ స్కిల్స్‌పైనే ప్రధాన ఫోకస్‌

సంపాదన సామర్థ్యం పెంచుకోవడమే ముఖ్య లక్ష్యం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సాంకేతికత. ఏఐతో కొత్త అవకాశాలు రావడమే కాదు.. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగాలకు ముప్పు రానుందని అత్యధిక మంది నిపుణులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యాలను పెంచుకోవాలన్న కృతనిశ్చయం వారిలో కనిపిస్తోంది. మెషీన్  లెర్నింగ్, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారని ‘గ్రేట్‌ లెర్నింగ్‌’ సర్వేలో తేలింది.

సాంకేతికతతో తమ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని భావించే వారిలో 21 నుండి 28 సంవత్సరాల వయసు గల యువత (జనరేషన్ –జెడ్‌) అత్యధికంగా ఉండటం విశేషం. ముఖ్యంగా ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని 74% మంది జెన్ –జెడ్‌ తరం భావిస్తున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగానికి ఢోకా లేదని 64 శాతం మంది ధీమాగా ఉన్నారు.

45–60 సంవత్సరాల వయసు గల జనరేషన్ –ఎక్స్‌లో 56% మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా 69% మంది నిపుణులు తమ ఉద్యోగాలకు ఏఐ వల్ల ప్రమాదం ఉందని నమ్ముతున్నారు. ‘అప్‌స్కిల్లింగ్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ 2025–26’ పేరుతో ఎడ్‌టెక్‌ కంపెనీ ‘గ్రేట్‌ లెర్నింగ్‌’ దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 1,000 మందికిపైగా నిపుణులతో చేసిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

నైపుణ్యం పెంచుకుంటాం..
ఈ సంవత్సరం నైపుణ్యాలను పెంచుకోవాలని 81% మంది భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సంఖ్య దేశంలోనే అత్యధికంగా 90 శాతం ఉంది. తమ కెరీర్‌లపై ఏఐ ప్రభావం సానుకూలంగా ఉంటుందని 78% మంది చెబుతున్నారు. ఈ ఏడాది 73% మంది నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకోవడంపై నమ్మకంగా ఉన్నారు. 82% మంది చురుగ్గా కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇక 29–44 ఏళ్ల వయసున్న (మిలీనియల్స్‌) ఉద్యోగుల్లో 90 శాతం మంది నైపుణ్య విలువను గుర్తించారు. జెన్ –జెడ్‌ విషయంలో ఇది 79 శాతం. కానీ ఆఫీసు పని గంటల కారణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను సంపాదించడం అడ్డంకిగా మారిందని 37% మంది అంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంటి పని కారణంగా కొత్త కోర్సులు నేర్చుకోలేకపోతున్నామని 25 శాతం మహిళలు చెబుతుంటే.. ఇలా చెప్పిన పురుషులు 20 శాతం కావడం విశేషం.

6 వారాల నుంచి ఆరు నెలలు..
కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ –ఏఐని ఉపయోగిస్తున్నట్లు 80% మంది నిపుణులు వెల్లడించారు. మెషీన్‌ లెర్నింగ్, ఏఐ విభాగాల్లో నైపుణ్యం పెంచుకుంటామని 44 శాతం మంది తెలిపారు. తమ పనిలో జెన్ –ఏఐని ‘ఎల్లప్పుడూ’ లేదా ’తరచుగా’ ఉపయోగిస్తామని 60% మంది చెబుతున్నారు. ఇక ఐటీ, ఐటీఈఎస్, బీపీఎం, టెలికం రంగాల్లో పనిచేస్తున్నవారిలో 91 శాతం మంది నైపుణ్యం మెరుగుపర్చుకోవడం ముఖ్యం అని తెలిపారు. 64% మంది నిపుణులు 6 వారాల నుంచి 6 నెలల నిడివిగల ప్రోగ్రామ్స్‌తో నైపుణ్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారు.

జెన్ –జీ ప్రధానంగా స్వల్పకాలిక ప్రోగ్రామ్స్‌ను ఇష్టపడుతున్నారు. 50% మంది 6 వారాల కంటే తక్కువ లేదా 6 వారాల నుండి 3 నెలల మధ్య ఉన్న ప్రోగ్రామ్‌లను ఇష్టపడుతున్నారు. దేశీయ యూనివర్సిటీలు అందించే సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్స్‌ చేస్తున్నామని 43 శాతం చెప్పగా.. అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్స్‌ చేస్తున్నామని 36 శాతం తెలిపారు. తల్లి/తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న ఉద్యోగుల్లో 90% మంది నిపుణులు నైపుణ్యం పెంపుదల ముఖ్యమైనదని భావిస్తున్నారు. ఇతర (పెళ్లికాని లేదా పిల్లలు లేనివారు) నిపుణుల్లో ఈ సంఖ్య 76 శాతమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement