వైరల్‌: భర్తకు కోవిడ్‌.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య

Agra Woman Resuscitating Covid Husband by Breathing into Mouth - Sakshi

ఆగ్రాలో వెలుగుచూసిన హృదయవిదారక సంఘటన

కోవిడ్‌ బారిన పడ్డ భర్తకు నోటి ద్వారా శ్వాస

భార్య ఒడిలోనే కన్నుమూసిన భర్త

లక్నో: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. గతంతో పోలిస్తే ఈ సారి ఆక్సిజన్ వినియోగం భారీగా పెరిగింది. కానీ అవసరానికి సరిపడా ప్రాణవాయువు నిల్వలు లేక చాలా మంది మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్‌‌ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేప్పే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

కోవిడ్‌ బారిని పడిన భర్త శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే బెడ్లు ఖాళీ లేవని వారిని ఏ ఆస్పత్రిలో కూడా చేర్చుకోలేదు. ఈ లోపు బాధితుడి పరిస్థితి విషమించసాగింది. దాంతో ప్రమాదం అని తెలిసి కూడా భార్య తన నోటి ద్వారా భర్తకు శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నం వృథా అయ్యింది. చివరకు ఆ వ్యక్తి భార్య ఒడిలోనే కన్నుమూశాడు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

ఆ వివరాలు.. ఆగ్రా వికాస్‌ సెక్టార్‌ 7కు చెందిన రవి సింఘాల్‌ కోవిడ్‌ బారిన పడ్డాడు. దాంతో అతడి భార్య రేణు సింఘాల్‌, రవి సింఘాల్‌ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ బెడ్స్‌ ఖాళీగా లేకపోవడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. ఈలోపు రవి సింఘాల్‌కు ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దాంతో రేణు సింఘాల్‌ అతడిని సరోజిని నాయుడు మెడికల్‌ కాలేజీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఆటోలో ఎక్కి ఆస్పత్రి వెళ్తుండగా అతడి పరిస్థితి చేయి దాటిపోసాగాంది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడసాగాడు. 

దాంతో ప్రమాదం అని తెలిసి కూడా రేణు సింఘాల్‌ అతడికి నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసిది. కానీ అవేవి ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకునేలోగానే అతడు ఆటోలోనే భార్య ఒడిలో కన్ను మూశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తనకు ప్రమాదం అని తెలిసి కూడా భర్త ప్రాణాల కోసం రేణు సింఘాల్‌ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆమె భర్త బతికి ఉంటే బాగుండు అని వాపోతున్నారు. 

ఇక ఆగ్రాలో చాలా ఆస్పత్రుల్లో బెడ్స్‌ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్‌ నిల్వలు అయిపోవడంతో పలువురు మరణించారు. ఈ పరిస్థితులపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు ప్రజల కష్టాలు పట్టవా అని విమర్శిస్తున్నారు. ఇక భారతదేశంలో సోమవారం మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక  గడిచిన 24 గంటల్లో 2,812 మంది కోవిడ్‌ పేషెంట్లు మృతి చెందారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top