
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామాలను గమనించిన కర్నాటక కూడా ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)దేశవ్యాప్తంగా పాఠశాలల్లో త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా దానిని తిరస్కరించింది. మహారాష్ట్ర సర్కారు ప్రాథమిక పాఠశాలలకు త్రిభాషా విధానాన్ని నిలిపివేసిన దరిమిలా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యావిధానంలో ద్విభాషా సూత్రానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య తాము ద్విభాషా విధానానికి అనుకూలంగా ఉన్నామని, తమ ప్రభుత్వం దీనికే కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.
వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో భాషా విధానాలపై చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక పాఠశాలల్లో ప్రస్తుతమున్న విద్యావిధానంలో.. విద్యార్థులు ఐదవ తరగతి వరకు రెండు భాషలు నేర్చుకోవాలి. ఆరవ తరగతి నుండి హిందీని మూడవ భాషగా ప్రవేశపెడతారు. ఎనిమిదవ తరగతిలో విద్యార్థులకు కన్నడ, ఇంగ్లీష్ లేదా సంస్కృతంలలో ఏదో ఒక దానిని మొదటి భాషగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న పక్షంలో, వారికి కన్నడ మూడవ భాషగా తప్పనిసరి అవుతుంది.
ఇది కూడా చదవండి: ‘భాగస్వామి’పై దారుణం.. మృతదేహంతో రెండు రోజులు సావాసం