‘టీసీ’ లేకున్నా అడ్మిషన్‌..

Admissions In Tamil Nadu Government School Without Submission Of TCs - Sakshi

విద్యాశాఖ చర్యలు

ఫీజుల ఒత్తిడి

ప్రైవేటుకు మంత్రి హెచ్చరిక 

సాక్షి, చెన్నై: ప్రైవేటు స్కూళ్లలో ఇదివరకు చదువుకుని ఉన్న పక్షంలో, ఆ విద్యార్థులు టీసీలు సమర్పించకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే వెసులుబాటను విద్యాశాఖ కల్పించింది. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల ఒత్తిడి తీసుకొస్తుండడంతో చర్యలు తప్పవని విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్‌ హెచ్చరించారు. కరోనా కష్టాలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిప్పి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అనేక మంది ప్రస్తుతం మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలల్లో అడ్మిషన్లు హోరెత్తుతున్నాయి. అయితే, ఇది వరకు తమ పిల్లలు చదువుకున్న పాఠశాలలు టీసీలు ఇవ్వడంలో జాప్యం చేయడం, ఫీజులు చెల్లిస్తేనే టీసీ అంటూ వేధిస్తున్నట్టుగా విద్యాశాఖకు ఫిర్యాదులు పెరిగాయి. అదే సమయంలో ఒక తరగతి నుంచి మరో తరగతిలో చేరాలంటే ప్రభుత్వ పాఠశాలలో టీసీ సమర్పించాల్సి ఉంది. అయితే, ప్రైవేటు విద్యా సంస్థలు టీసీలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు  ఇబ్బందులు తప్పలేదు. దీనిపై విద్యాశాఖకు ఫిర్యాదులు హోరెత్తాయి.

దీంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీసీ సమర్పించకుండానే అడ్మిషన్లు పొందేందుకు  వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  తిరుచ్చి విద్యాశాఖ అధికారి శాంతి పేర్కొంటూ ఫిర్యాదులను పరిగణించి టీసీ లేకున్నా అడ్మిషన్లపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. కాగా, ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులను ఈరోడ్‌లో శాలువతో సత్కరించి మరీ ఉపాధ్యాయులు ఆహ్వానిస్తుండడం విశేషం. ఇక, అడ్మిషన్లను పరిగణించి ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. 

చర్యలు తప్పవు.. 
ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఫీజుల పేరిట తల్లిదండ్రుల్ని వేధిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తే, ఆయా విద్యా సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఒకటో తరగతిలో లక్షా 72 వేల మంది కొత్తగా చేరారని, సెప్టెంబరులోనూ అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో సాగుతాయని తెలిపారు. పాఠ్యపుస్తకాలన్నీ సిద్ధంగానే ఉన్నాయని, కొత్తగా చేరే విద్యార్థులకు 14 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు తగ్గ చర్యలపై సీఎంతో సమీక్షించనున్నామన్నారు. ఇదిలాఉండగా వివిధ కళాశాల్లో చదువుతూ అరియర్స్‌ రాయడం కోసం ఫీజులు కట్టిన విద్యార్థులందరూ ఆల్‌పాస్‌ అని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దృష్ట్యా, వీరిని కూడా పాస్‌ చేయాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top