శ్రద్ధా వాకర్‌ కేసు వల్లే అంతా.. తునిషా కేసులో షీజాన్‌ ఖాన్‌ సంచలన వాంగ్మూలం

Actor Tunisha Sharma Case: Shraddha Walkar Case Forced Break Up - Sakshi

ముంబై: ప్రముఖ టీవీ నటి తునిషా శర్మ మృతి దర్యాప్తు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు షీజాన్‌ ఖాన్‌ పోలీసుల ముందు కీలక వాంగ్మూలం ఇచ్చాడు. పోలీస్‌ కస్టడీలో భాగంగా తొలిరోజు సోమవారం(ఇవాళ) వాలివ్‌ పోలీసులకు తమ రిలేషన్‌షిప్‌ ముగింపునకు కారణం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసేనని చెప్పాడు. 

శ్రద్ధా వాకర్‌ ఘోర హత్యోదంతం తర్వాత.. దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇద్దరికీ వయసు అంతరంతో(ఎనిమిదేళ్ల గ్యాప్‌) పాటు వేర్వేరు కమ్యూనిటీలనే ఆటంకాలు తప్పవని భావించా. అందుకే బలవంతంగా ఆమెకు బ్రేకప్‌ చెప్పా అని షీజాన్‌ పోలీసులకు వెల్లడించాడు. శ్రద్దా వాకర్‌ కేసు నాపై ఒత్తిడి పెంచింది. లేనిపోని ఇరకాటంలో పడతామనే వద్దనుకున్నా. తునిషా మతం వల్లే ఆమెకు బ్రేకప్‌ చెప్పాను!. అంతేకాదు.. ఇంతకు ముందు తునిషా ఆత్మహత్యాయత్నం చేసిందని ఇంటరాగేషన్‌లో షీజాన్‌ పోలీసులకు వెల్లడించాడు. 

‘‘చనిపోవడానికి కొన్నిరోజులు ముందు కూడా ఆమె సూసైడ్‌ యత్నం చేసింది. ఆ సమయంలో నేనే ఆమెను రక్షించా. తునిషా తల్లికి అప్పగించి..  జాగ్రత్తగా చూసుకోవాలని ఆమెకు సూచించా.’’ అని పోలీసులకు వెల్లడించాడు. 

ఇదిలా ఉంటే.. డిసెంబర్‌ 24వ తేదీ టీవీ షూటింగ్‌ జరుగుతున్న చోట టాయ్‌లెట్‌లో తునిషా శర్మ(20) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా కనిపించింది. ఐపీసీ సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ కనిపించలేదు. బహుశా బ్రేకప్‌ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఇద్దరు టీవీ నటులు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు. అయితే పదిహేను రోజుల కిందట షీజాన్‌ ఆమెకు బ్రేకప్‌ చెప్పినట్లు తెలుస్తంది. శనివారం ఉదయం ఇంటి నుంచి యధాతధంగా ముంబై వాసాయిలో జరిగే షూటింగ్‌కు వెళ్లిందామె. ఫస్ట్‌ షిఫ్ట్‌ షూట్‌లో షీజాన్‌, తునిషాలు కలిసే పాల్గొన్నారు. ఆ షూటింగ్‌ సమయంలోనే ఆమె సూసైడ్‌కు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద షీజాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

ఇదిలా ఉంటే.. తునిషా శర్మ తల్లి వనిత, షీజాన్‌ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. తన కూతురిని షీజాన్‌ వాడుకుని, వదిలేశాడంటూ ఆరోపిస్తోంది. మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తూనే.. తునిషాతో ప్రేమాయణం నడిపాడు. మూడు నాలుగు నెలలు ఆమెను బాగా వాడుకున్నాడు. నా బిడ్డను పొగొట్టుకున్నా. నాకు న్యాయం చేయండి. షీజాన్‌ను శిక్షించండి అని కోరుతోందామె.

ఇదిలా ఉంటే ఈ కేసులో లవ్‌ జిహాదీ కోణం తెరపైకి రాగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు పూర్తయితేనే గానీ ఏం చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి గిరిష్‌ మహాజన్‌ సైతం ఇది లవ్‌ జిహాద్‌ వ్యవహారమేనని, షిండే ప్రభుత్వం లవ్‌ జిహాదీకి వ్యతిరేకంగా గట్టి చట్టం తేవాలంటూ కామెంట్‌ చేయడం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top