నేడే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

5 State Assembly Election Results 2021: Counting, Live Updates In Telugu - Sakshi

2,364 కౌంటింగ్‌ హాళ్లు సిద్ధం 

ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం 

రాత్రికల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు 

కరోనా నెగటివ్‌ రిపోర్టు/డబుల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పిస్తేనే నేతలు, ఏజెంట్లకు అనుమతి 

కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలు 

న్యూఢిల్లీ/కోల్‌కతా/చెన్నై/తిరువనంతపురం: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 2016లో ఆయా రాష్ట్రాలన్నింటిలో కలిపి 1,002 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 2,364 హాళ్లు సిద్ధం చేశారు. అంటే హాళ్ల సంఖ్యను ఏకంగా 200 శాతం పెంచారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 1,113, కేరళలో 633, అస్సాంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్‌ చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్‌ రిపోర్టు లేదా డబుల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. 

కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్‌లను శానిటైజ్‌ చేయనున్నారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కేరళలో 140 శాసనసభ స్థానాలున్నాయి. ఏప్రిల్‌ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 234 స్థానాలుండగా, దాదాపు 4 వేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలతోపాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

బెంగాల్‌ ఎవరిదో? 
దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమయ్యింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి. అస్సాంలో అధికార బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్లు తేలింది. కేరళలో అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్డీఎఫ్‌) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ–ఏఐఏడీఎంకే–ఏఐఎన్‌ఆర్‌సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమికి భంగపాటు ఎదురవుతుందని, ప్రతిపక్ష డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి గద్దెనెక్కబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top