దారుణం: విద్యుత్ నిలిచిపోవ‌డంతో న‌లుగురు న‌వ‌జాత శిశువులు మృతి | Sakshi
Sakshi News home page

దారుణం: విద్యుత్ నిలిచిపోవ‌డంతో న‌లుగురు న‌వ‌జాత శిశువులు మృతి

Published Tue, Dec 6 2022 4:07 PM

4 Newborns Die At Government Hospital In Chhattisgarh Probe Launched - Sakshi

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఒక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో విషాదంచోటుచేసుకుంది. సర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లోని ప్రభుత్వ మెడిక‌ల్ కళాశాల అసుపత్రిలో న‌లుగురు న‌వ‌జాత శిశువులు మృత్యువాత ప‌డ్డారు. ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్​ సరఫరా నిలిచిపోవడం వల్ల వెంటిలేటర్‌ పనిచేయకపోవడంతో ఆక్సిజన్‌ అందక నలుగురు పసికందులు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అర్థరాత్రి మూడు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే శిశువుల మృతికి కారణమని మండిపడ్డారు. 

అయితే విద్యుత్ అంతరాయం కారణంగా పిల్ల‌లు చ‌నిపోయార‌నే విష‌యాన్ని ఆస్ప‌త్రి సిబ్బంది బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఆసుపత్రిలో శిశువులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌ స్పందించారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. త్వరితగతిన విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ యుకే శిశువుల మరణాలపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చనిపోయిన శిశువు ఒకరోజు నుంచి నలుగురు రోజుల వయసున్న వారని కలెక్ట‌ర్ కుంద‌న్‌ కుమార్ పేర్కొన్నారు. ఆ న‌లుగురు శిశువుల ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మంగా ఉండ‌డంతో స్పెష‌ల్ న్యూ బార్న్ కేర్ యూనిట్‌లో ఉంచారని, వారిలో ఇద్ద‌రినీ వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉద‌యం 5:30 నుంచి 8:30 గంట‌ల మ‌ధ్య‌ న‌లుగురు చిన్నారులు చ‌నిపోయారని ఆయన వెల్లండిచారు. అయితే కరెంట్ లోపంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పలేమని అన్నారు. వెంటిలేటర్లు కూడా ఆగిపోలేదని, పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ ఆగిపోయిందా లేదా అనే విషయం విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు.
చదవండి: బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు

Advertisement
Advertisement