సరిహద్దులో ఎన్‌కౌంటర్‌..  ముగ్గురు మావోయిస్టులు మృతి 

3 Maoists killed in Police Encounter In Bijapur District - Sakshi

ములుగు జిల్లా అడవుల్లో ఘటన  

ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌..: మావోయిస్టు పార్టీ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు దండకారణ్యంలో సోమవారం తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు బీజాపూర్‌ – ములుగు జిల్లా పేరూరు పోలీస్‌స్టేషన్‌ పరిధి టేకులగూడకు 25 కిలోమీటర్ల దూరంలోని తర్లగూడ అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.

ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ కథనం ప్రకారం.. బీజాపూర్‌ జిల్లా సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ హత్యలు చేయడానికి, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి వ్యూహరచన చేస్తోందనే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ములుగు, బీజాపూర్‌ పోలీసు బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్‌ దళాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించాయి.

ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ దళ సభ్యులు పోలీసుల పైకి కాల్పులు జరపగా ప్రత్యేక దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పుల అనంతరం ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ లైట్‌ మెషీన్‌గన్, ఒక ఏకే–47, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రి, తూటాలు, 12 కిట్‌బ్యాగులు లభ్యమయ్యాయి. కాల్పులు జరుపుతూ కొంతమంది మావోయిస్టులు పారిపోయారు.  పారిపోయిన వారి కోసం ప్రత్యేక దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. సంఘటన ప్రదేశం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం పరిధిలోకి వస్తుందని చెప్పారు.  

మృతులు వీరే: ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట సోమవారం విడుదలైన ప్రకటనలో ఆ వివరాలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ రీజనల్‌ సెంటర్‌ సీఆర్‌సీ కంపెనీ–2కు చెందిన నరోటి దామాల్‌ (మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతం), సోడి రామాల్‌  (బీజాపూర్‌ జిల్లా బాసగూడెం ప్రాంతం), పూ నెం బద్రు అలియాస్‌ కల్లు (బీజాపూర్‌ జిల్లా పెద్దకోర్మ) అమరులైనట్టు పేర్కొన్నారు. 

రేపు బంద్‌కు పిలుపు
ములుగు జిల్లా టేకులగూడ అడవిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌గా జగన్‌ ప్రకటించారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వల్ల ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెట్టింపు ఉత్సాహంతో అణచివేతకు పూనుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 27న రాష్ట్రబంద్‌ను పాటించాలని జగన్‌ కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top