ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగులు మృతి

26 Covid Patients Die At Goa Hospital - Sakshi

పనాజి: పశ్చిమ తీర రాష్ట్రం గోవాలోని ప్రభుత్వ గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసిహెచ్)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రిలో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు చనిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 2 నుండి 6 గంటల మధ్యలో ఈ దుర్ఘటన జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజీత్‌ రాణే తెలిపారు. అయితే, ఈ ఘటనకు గల కారణాలపై స్పష్టత లేదని అన్నారు.

ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ఆసుపత్రికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెళ్లారు. "మెడికల్ ఆక్సిజన్ లభ్యత, జీఎంసిహెచ్ లోని కోవిడ్-19 వార్డులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో అవాంతరం ఏర్పడటం వల్ల రోగులకు కొన్ని సమస్యలను కలిగించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మాత్రం ఆక్సిజన్ సరఫరా కొరత లేదు అని అన్నారు. కొన్ని సార్లు సిలిండర్లు సమయానికి చేరుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గోవా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో వైద్య ఆక్సిజన్ సరఫరాలో కొరత ఉందని ఆరోగ్య మంత్రి విశ్వజీత్‌ రాణే సోమవారమే చెప్పారు. నిన్న ఆసుపత్రిలో 1,200 జంబో సిలిండర్లు అవసరం ఉండగా కేవలం 400 మాత్రమే సరఫరా చేయబడ్డాయి అని తెలిపారు.

ఈ ఘటనపై హైకోర్టు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో కొరత ఉంటే, ఆ అంతరాన్ని ఎలా తగ్గించాలో చర్చ జరగాలి" అని రాణే అన్నారు. గోవా మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో కోవిడ్ -19 చికిత్సను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ అధికారుల ముగ్గురు సభ్యుల బృందం ఈ సమస్యల గురించి ముఖ్యమంత్రికి తెలియజేయాలని మిస్టర్ రాణే అన్నారు. గోవాలో సోమవారం నాటికి 1,21,650 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు 1729 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.

చదవండి:

కోవిడ్-19 రోగుల‌కు ఆక్సీమీట‌ర్లు ఎందుకు అవసరం?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top