డిసెంబర్‌కల్లా 216 కోట్ల టీకా డోసులు

216 Crore COVID19 Vaccine Doses Will Be Available By End Of 2021 - Sakshi

మద్రాసు హైకోర్టుకు తెలిపిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిసెంబర్‌ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో కోవిడ్‌ నిర్వహణపై మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసు, పలు కేసులను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ, జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ధర్మాసనం అనుమతించింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌లో డిసెంబర్‌ నాటికి దేశంలో 216 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసిన అంశంపై ధర్మాసనం స్పందించింది. దేశంలో వారందరికి ఈ డోసులు సరిపోతాయా అని ప్రశ్నించింది.

సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌లతోపాటు క్యాడిలా వంటి సంస్థలు ఉత్పత్తి పెంచనున్నాయని, ఈ మేరకు డిసెంబరు నాటికి 216 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచిన విషయాన్ని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఆర్‌ శంకర నారాయణన్‌ తెలిపారు. దీంతో దేశంలో అందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని ఆయన తెలిపారు. అనంతరం ధర్మాసనం ఆదేశాలు వెలువరిస్తూ.. ప్రజలకు వ్యాక్సినేషన్‌ పట్ల అవగాహన కల్పించాలని పేర్కొంది.

సమాజంలో వివిధ నమ్మకాలతో టీకా తీసుకోని వారున్నట్లు అభిప్రాయపడింది. వారందరూ టీకాలు తీసుకొనేలా కేంద్రం, రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణకు తగిన ఔషధాలు రాష్ట్రానికి ఉత్పత్తి సంస్థలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. రాష్ట్ర జనాభా, పాజిటివిటీ రేటును అనుసరించి వ్యాక్సిన్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొందని, అయితే సంస్థలు ఉత్పత్తి పెంచనున్న నేపథ్యంలో రాష్ట్రానికి తగినట్లుగా వ్యాక్సిన్లు అందుతాయని కనిపిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదాకు వేసింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top