అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో 38 మందికి మరణ శిక్ష

2008 Ahmedabad Blast Case: 38 Convicts Sentenced To Death 11 Life Imprisonment - Sakshi

 మరో 11 మందికి జీవిత ఖైదు

56 మందిని బలిగొన్న పేలుళ్లు 

మోదీ, అమిత్‌ షా కూడా లక్ష్యమే 

తీర్పులోనూ ప్రస్తావించారన్న లాయర్‌ 

అప్పట్లో మోదీ గుజరాత్‌ సీఎం కాగా అమిత్‌ షా హోం మంత్రి 

ఒకే కేసులో ఇందరికి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని జరిగిన 2008 అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో 38 మంది ఇండియన్‌ ముజాహిదీన్‌ ముష్కరులకు మరణశిక్ష పడింది. వాళ్లను చనిపోయేదాకా ఉరి తీయాలని ప్రత్యేక కోర్టు జడ్జి ఏఆర్‌ పటేల్‌ ఆదేశించారు. మరో 11 మందికి జీవితఖైదు విధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన 7,000 పేజీల పై చిలుకు తీర్పు వెలువరించారు. ఒకే కేసులో ఏకంగా ఇంతమందికి మరణ శిక్ష పడటం మన దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో 26 మందికి మరణ శిక్ష విధించడమే ఇప్పటిదాకా రికార్డు.

ఈ పేలుళ్ల ద్వారా అప్పుడు గుజరాత్‌ సీఎంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని చంపాలన్నది కూడా కుట్రదారుల లక్ష్యమని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుధీర్‌ బ్రహ్మభట్‌ తీర్పు అనంతరం మీడియాకు చెప్పారు. 2010లో నమోదు చేసిన చార్జిషీట్లో ఒక నిందితుడు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఆయన వివరించారు. ఈ విషయాన్ని జడ్జి తన తీర్పులో కూడా పొందుపరిచారని చెప్పారు. ‘‘పేలుళ్ల ద్వారా మోదీని కూడా చంపాలని కుట్రదారులు ప్రయత్నించారని జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. నాటి గుజరాత్‌ హోం మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు అప్పటి మోదీ మంత్రివర్గ సహచరులు ఆనందీబెన్‌ పటేల్, నితిన్‌ పటేల్, స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్‌సింగ్‌ జడేజా తదితరులను కూడా చంపాలన్నది ఉగ్రవాదుల ప్లాన్‌ అని వివరించారు’’ అని ఆయన పేర్కొన్నారు.  

14 ఏళ్ల పాటు విచారణ 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 2009లో విచారణ మొదలైంది. ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన 78 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఒకరు 2019లో అప్రూవర్‌గా మారారు 49 మందిని దోషులుగా ఫిబ్రవరి 8న కోర్టు తేల్చింది. మరో 28 మందిని వదిలేసింది. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, మరొకరికి రూ.2.88 లక్షలు జరిమానా విధించారు.  మరణశిక్ష పడ్డ వాళ్లలో ప్రధాన కుట్రదారులైన మధ్యప్రదేశ్‌కు చెందిన సఫ్దర్‌ నగోరీ, కమ్రుద్దీన్‌ నగోరీ, గుజరాత్‌కు చెందిన ఖయాముద్దీన్‌ కపాడియా, జహీద్‌ షేక్, షంషుద్దీన్‌ షేక్‌ తదితరులున్నారు. తీర్పు వెలువడ్డాక ప్రధాన కుట్రదారు సఫ్దర్‌ నగోరీలో పశ్చాత్తాప ఏ మాత్రమూ కన్పించలేదని పోలీసులు చెప్పారు. అతను ప్రస్తుతం భోపాల్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని దోషుల తరఫున లాయర్లు తెలిపారు.  

ఏం జరిగింది? 
∙2008 జూలై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వరుస బాంబు పేలుళ్లు వణికించాయి. 
∙సాయంత్రం 6.45 నుంచి గంటంపావు పాటు 14 చోట్ల 21 పేలుళ్లతో నగరం దద్దరిల్లిపోయింది. 
∙56 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. మరో రెండు బాంబులు పేలలేదు. 
∙ఇది తమ పనేనని సిమి కనుసన్నల్లో నడిచే ఇండియన్‌ ముజాహిదీన్‌ ప్రకటించుకుంది. 
∙తర్వాత రెండు రోజుల్లో సూరత్‌లో 29 లైవ్‌ బాంబులు దొరకగా నిర్వీర్యం చేశారు. 
∙2002 గోధ్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగా పేలుళ్లకు పాల్పడ్డట్టు నిందితులు పేర్కొన్నారు. 
∙పేలుళ్ల కుట్ర 2007లో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో అడవుల్లో ఐఎం క్యాంపులో జరిగింది. 
∙దేశవ్యాప్తంగా రిక్రూట్‌ చేసుకున్న 50 మందికి అక్కడ పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. 
∙పేలుళ్లకు పాల్పడుతున్నట్టు సరిగ్గా 5 నిమిషాల ముందు మీడియా సంస్థలకు ఉగ్రవాదులు ఇ–మెయిళ్లు పంపారు. 

విచారణ–విశేషాలు 
∙అహ్మదాబాద్‌లో నమోదైన 20 ఎఫ్‌ఐఆర్‌లు, సూరత్‌లో నమోదైన 15 ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారణ చేపట్టారు. 
∙ప్రస్తుత గుజరాత్‌ డీజీపీ ఆశిష్‌ భాటియా సారథ్యంలో విచారణ మొదలైంది. 
∙విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. బేలా త్రివేది నుంచి ఏఆర్‌ పటేల్‌ దాకా మొత్తం 9 మంది జడ్జీలు విచారణ జరిపారు. 
∙నిందితుల్లో 24 మంది 213 అడుగుల సొరంగం తవ్వి పారిపోయే ప్రయత్నం చేశారు. 

    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top