కశ్మీర్‌లో మళ్లీ పౌరులపై దాడులు.. నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య

 Migrant Workers Killed In 2nd Targeted Attack In Kashmir - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  మైనార్టీలు, వలస కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు.  షోపియాన్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో గ్రెనేడ్‌ దాడి చేయగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులు జరగటం భయానక పరిస్థితులను తలపిస్తోంది. 

షోపియాన్‌లోని హర్మెన్‌ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపైకి టెర్రరిస్టులు గ్రెనేడ్‌ విసిరారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్‌, మోనిశ్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడి నేపథ్యంలో హర్మెన్‌ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్‌ ఉగ్రవాది ఇమ్రాన్‌ బషీర్‌ గనీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణంలో కూలీలపైకి గ్రెనేడ్‌ విసిరింది ఇమ్రానే అని తేలింది.

గత శనివారం ఇదే షోపియాన్‌ ప్రాంతంలో పురాన్‌ క్రిషన్‌ భట్‌(56) అనే కశ్మీరీ పండిట్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్‌ గ్రామంలో పూరాన్‌ భట్‌ తన ఇంటి వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భట్‌.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ ప్రకటించింది. భట్‌ హత్యతో కశ్మీర్‌ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు సెప్టెంబర్‌ 2న మునీర్‌ ఉల్‌ ఇస్లామ్‌ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

ఇదీ చదవండి: ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు: కుంకుమ-పసుపు క్లూస్‌.. పూజలు వికటించడంతో కక్షగట్టి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top