దేశంలో కరోనా విశ్వరూపం.. ఎందుకీ విజృంభణ..? 

1,52,879 Fresh Coronavirus Cases In India In Biggest Ever One Day - Sakshi

ఒకే రోజు లక్షన్నరకుపైగా కేసులు 

11 లక్షలు దాటేసిన యాక్టివ్‌ కేసులు 

అయిదు రాష్ట్రాల నుంచి 70% కేసులు  

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఒకే రోజులో లక్షన్నరకిపైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన పెరిగిపోతోంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య తొలిసారిగా 11 లక్షలు దాటేసింది. ఇప్పటివరకు ఫస్ట్‌ వేవ్‌ లో కూడా ఈ స్థాయిలో యాక్టివ్‌ కేసులు నమోదు కాలేదు. వీటి సంఖ్య ఇంకా పెరిగిపోతే ఆస్పత్రుల్లో చికిత్స, పడకలు వంటివి చాలా ఇబ్బందిగా మారతాయి. కేంద్ర ఆరోగ్య శాఖ అదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల్లో 1,52,879 కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కి చేరుకుంది. ఒకే రోజులో 839 మంది కరోనాకు బలి కావడంతో మొత్తం మరణాల సంఖ్య 1,69,275కి చేరుకుంది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయాయి. ప్రస్తుతం 11,09,087 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా మొదటి వేవ్‌ సమయంలో సెప్టెంబర్‌ 17నాటి 10,17,754 యాక్టివ్‌ కేసులే ఇప్పటివరకు అత్యధికం.  

5 రాష్ట్రాలు 70% కేసులు: దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచే 70శాతం కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 55,411 కేసులు నమోదవగా, ఛత్తీస్‌గఢ్‌లో 14,098, ఉత్తరప్రదేశ్‌లో 12,748 కేసులు నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో అంతకంతకూ కేసులు ఎక్కువైపోతున్నాయి. గత 24 గంటల్లో 10,732 కేసులు నమోదయ్యాయి. కరోనా బట్టబయలయ్యాక ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.   

మధ్యప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ విధించం: మధ్యప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా కర్ఫ్యూ మాత్రమే అమలు చేస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగకపోతే కష్టమని అన్నారు. అయితే వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడానికి కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు.   చదవండి: (మా వ్యాక్సిన్లకు సామర్థ్యం తక్కువ: చైనా) 

ఎందుకీ విజృంభణ..? 
భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉధృతి పెరిగిపోవడానికి శాస్త్రవేత్తలు రకరకాల కారణాలను చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగడం, కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రెండు మ్యుటేషన్లతో కూడిన కొత్త రకం కరోనా కేసులు దేశంలో బయల్పడడం వంటివెన్నో కేసుల్ని పెంచిపోషిస్తున్నాయని వైరాలజిస్టులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చేసిందన్న ధీమాతో ప్రజలెవరూ మాస్కులు పెట్టుకోకపోవడం, భౌతికదూరం పాటించడం వంటివి చేయడం లేదని అది కూడా కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణమేనని వైరాలజిస్టులు షామిద్‌ జమీల్, టీ జాకప్‌ జాన్‌లు తెలిపారు. కరోనా కొత్త మ్యూటెంట్లపై వ్యాక్సిన్‌ ఎలా పని చేస్తుందన్న దానిపైనే భారత్, ప్రపంచ దేశాల భవిష్యత్‌ ఆధారపడి ఉందని వారు తెలిపారు.     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top