కల్తీమద్యం తాగి 15 మంది మృతి

15 Dead After Consuming Illicit Liquor In Uttar Pradeshs Aligarh - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఘటన

అలీగఢ్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 15 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చేర్పించారు. కర్సియాలోని ఓ లైసెన్స్‌డ్‌ అమ్మకందారుడి దుకాణం నుంచి కొనుగోలు చేసిన కల్తీ మద్యం తాగడం వల్లే వారంతా మరణించినట్లు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. దోషులుగా తేలిన వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని జిల్లా కలెక్టర్‌ చంద్ర భూషణ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. లోథా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు మరణాలు సంభవించాయి. కర్సియాలో మరో 6 మంది మరణించినట్లు సమాచారం అందింది. వీరంతా ఒకే చోట మద్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్పారు.

మరికొంత మంది సైతం అస్వస్థతకు గురికాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లిక్కర్‌ షాపు సీజ్‌ చేసి శాంపిల్స్‌ను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక ఎక్సైజ్‌ విభాగం అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ, జిల్లా ఎక్సైజ్‌ ఆఫీసర్, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్, హెడ్‌ కాన్‌స్టేబుల్‌లను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై శాఖాసంబంధిత విచారణ ప్రారంభమైనట్లు తెలిపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top