ఆమె మెడలో కేజీ బంగారు తాళి.. పోలీసులు అవాక్‌!

1 KG Mangalsutra In Woman Neck Found It Fake - Sakshi

ముంబై : పెళ్లైన మహిళలు మామూలుగా తులాలలో మంగళసూత్రాన్ని చేయించుకుని మెడలో వేసుకోవటం పరిపాటి. అది కూడా పుట్టింటి వాళ్లో, అత్తింటి వాళ్లో తమ తాహతకు తగ్గట్టుగా చేయించి ఇచ్చినది ఉంటుంది. అధికంగా డబ్బు, బంగారంపై మోజు ఉంటే మామూలు కంటే కొన్ని ఎక్కువ తులాలతో మంగళసూత్రాన్ని చేయించుకుంటారు.  కానీ, మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు ఆమె భర్త కేజీ బంగారంతో మంగళసూత్రాన్ని చేయించి కానుకగా ఇచ్చాడు. ఆ మంగళసూత్రం కాస్తా సోషల్‌ మీడియాలో వైరలై పోలీసుల దృష్టిని ఆకర్షించింది. దానిపై ఎంక్వైరీ చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసి అవాకయ్యారు.

వివరాలు : మహారాష్ట్రలోని బివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో తయారు చేసిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. మోకాళ్ల వరకు పొడవున్న ఆ బంగారు మంగళసూత్రాన్ని ధరించి ఆమె, భర్తతో కలిసి వీడియో దిగింది. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు బాలాను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. మంగళసూత్రంపై ఎంక్వైరీ చేశారు. తన భార్యకు కానుకగా ఇచ్చిన ఒక కేజీ బంగారు మంగళసూత్రం నిజమైనది కాదని, పోత పోసిన నకిలీ బంగారందని చెప్పాడు. దాన్ని బంగారు షాపునుంచి 38వేల రూపాయలకు కొన్నానని తెలిపాడు.

దీంతో పోలీసులు అతడ్ని ఇంటికి పంపించేశారు. దీనిపై ఓ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ‘‘ కేజీ బంగారు తాళి వీడియో వైరల్‌గా మారింది. దీంతో అది నా దృష్టికి వచ్చింది. అధికంగా బంగారాన్ని కలిగి ఉండటం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవటం అన్నది దొంగల్ని ఆహ్వానించటమే. అందుకే బాలా కోలిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించాము. అది నకిలీ బంగారందని అతడు చెప్పాడు. ఓ బంగారు షాపునుంచి 38 వేలకు కొన్నానన్నాడు. మేము సదరు షాపులో ఎంక్వైరీ చేసి అది ఫేక్‌ అని తేల్చాము’’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top