మక్తల్: నియోజకవర్గంలో వ్యవసాయ కూలీల కొరత నెలకొన్న తరుణంలో వరికోతలకు అన్నదాతలు యంత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణా, నర్వ మండలాల్లో అధికంగా ఉంది. కృష్ణానది తీరప్రాంతం కావడం, భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లు ఉండటంతో అధిక మొత్తంలో వరి సాగు చేశారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో కూలీల కొరతతో రైతులు ఆధునిక యంత్రాలతో పంట కోతలు చేపడుతున్నారు.
ఉపాధి కూలి పనులకు..
ఉపాధిహామీ పథకం సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించడం, అలాగే పనిదినాలు కూడా పెరగడంతో అనేక మంది వ్యవసాయ కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కూలీల కొరత నెలకొంది. ముఖ్యంగా ముష్టిపల్లి, పారేవుల, పస్పుల, మాధ్వార్, చందాపూర్, అనుగొండ గ్రామాల్లో కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో వరి సాగు పెరగడం కూడా కూలీల కొరతకు కారణమని రైతులు చెబుతున్నారు. అలాగే రోజువారి కూలి రూ.500 నుంచి రూ.600 వరకు అడుగుతుండటంతో రైతులు యంత్రాలతోనే కోతలు సాగిస్తున్నారు.
గంటకు రూ.2,500 అద్దె..
కోత యంత్రాలతో ఖర్చు ఎక్కువైనప్పటికీ త్వరగా పనులు కావడం, ఒకేరోజు ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉండటంతో రైతులు యంత్రాలవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. తడి ఆరని పంటలైతే చెయిన్ మిషన్లు, ఆరిన పొలాలైతే టైర్ల మిషన్లతో కంది, వరి పంట కోయిస్తున్నారు. ముఖ్యంగా దుక్కి దున్నడం, నారు వేయడం, కోతలు కోయడం వంటి పనులన్నీ యంత్రాల ద్వారానే చేస్తుండటంతో యంత్రాల వినియోగం పెరిగింది. ప్రస్తుతం వరి కోతకు గంటకు రూ.2,500 నుంచి రూ.2,600 అద్దె చెల్లిస్తున్నారు. యంత్రాల కొనుగోలుకు బ్యాంకు రుణాలు ఇస్తుండటంతో చాలామంది రైతులు కొని అద్దెకు ఇచ్చుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
మాధ్వార్‌లో వరి పంట కోస్తున్న కోత యంత్రం
భూత్పూర్, సంగంబండ
రిజర్వాయర్ల కింద జోరుగా వరికోతలు
కూలీల కొరతతో ఇబ్బందులు
అద్దెకు అందుబాటులో
ఆధునిక యంత్రాలు


