నారాయణపేట/ఊట్కూర్: రైతులు తక్కువ నీటితో సాగ య్యే పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. మంగళవారం మండలంలోని అప్పక్‌పల్లి, చిన్నజట్రం, కొల్లంపల్లి, ఊట్కూరు మండ లం తిమ్మారెడ్డిపల్లి తండాలో ఆ మె పర్యటించి పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగు చేసిన వరి, టమాట, మిరప పంటలు నీరందక ఎండిపోతున్నాయని అప్పక్‌పల్లిలో రైతు కలెక్టర్‌కు వివరించారు. ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నానని.. కనీసం పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నజట్రం, కొల్లంపల్లిలో ఎండుతున్న వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గతేడాది ఇదే సమయంలో వర్షపాతం ఎలా ఉంది? అప్పట్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు? ప్రస్తుత పరిస్థితుల్లో దిగుబడులు, పెట్టు బడులు, ఆదాయంలో ఎంత వ్యత్యాసం ఉంది? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, వర్షపాతంలో లోటు ఏర్పడే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు వ్యవసాయరంగానికి సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, నేల స్వభావం, వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొని రైతులు పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా సాగు చేపడితే నష్టాలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, నీటి వనరుల లభ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు రైతులకు అవసరమైన వ్యవసాయ సలహాలు అందించాలన్నారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, మండల వ్యవసాయశాఖ అధికారి, ఏఈఓలు పాల్గొన్నారు.


