నర్వ/మాగనూర్: రైతులను కేవలం పంటసాగుదారులుగా కాకుండా నాణ్యమైన విత్తనోత్పత్తిదారులుగా తీర్చిదిద్దేలా ప్రోత్సహిద్దామని రైతువిజ్ఞాన కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ డా. ఈటెల సత్యనారాయణ అన్నారు. మంగళవారం నర్వ, మాగనూర్ పీఏసీఎస్‌ల పరిధిలోని వరి విత్తనోత్పత్తి క్షేత్రాలను ఆయన పరిశీలించారు. పొలాల్లో పాటిస్తున్న ఐసోలేషన్ దూరం (పరాగ సంపర్క నివారణకు అవసరమైన దూరం), ఇతర రకాల మొక్కలు ఉన్నాయా లేదా అంశాలను చూశారు. నాణ్యమైన, స్వచ్ఛమైన విత్తనోత్పత్తికి రైతులు విత్తన ధ్రువీకరణ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆయన వెంట విత్తన ధ్రువీకరణశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
జొన్న విత్తనాల పంపిణీ..
ఊట్కూర్: మండలంలోని పగిడిమారిలో రబీ సీజన్‌లో జొన్న సాగును ప్రోత్సహించేందుకు మంగళవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ ఈటెల సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఎస్‌వీ 41 రకం జొన్న విత్తనాలను పలువురు రైతులకు అందించి సాగుపై అవగాహన కల్పించారు. పంట కోత వరకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తామని తెలిపారు. యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, ఎరువుల నియంత్రణ తదితర అంశాలను దశల వారీగా వివరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జాఫర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


