జిల్లా పోలీసుశాఖ స్పెషల్ ఆపరేషన్
దసరా నుంచి వేట..
నాలుగు సర్కిళ్లలో
ప్రత్యేక బృందాలు..
100 మందికి పరీక్షలు.. 70 మందికి పాజిటివ్
సరిహద్దుల్లో పటిష్ట నిఘా..
గంజాయిపై
నారాయణపేట: జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసుశాఖ ఉక్కుపాదం మోపుతోంది. యువతను మత్తు కోరల నుంచి బయటపడేయడంతో పాటు గంజాయి సరఫరా మూలాలను ఛేదించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ డా.వినీత్ దిశానిర్దేశంతో జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మక్తల్ పోలీసు సర్కిళ్ల పరిధిలో తనిఖీలను ముమ్మరం చేశారు. తాజాగా ధన్వాడ పీఎస్ పరిధిలో పలువురు అనుమానితులకు పరీక్షలు చేయగా.. 30 ఏళ్లలోపు యువత గంజాయి వినియోగించినట్లు తేలినట్టు సమాచారం. యువతను మత్తు కోరల నుంచి బయటపడేయడంతో పాటు సరఫరా మూలాలను ఛేదించడమే లక్ష్యంగా పోలీసుల వేట సాగుతోంది.
జిల్లాలో గంజాయి వినియోగానికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని నాలుగు పోలీసు సర్కిళ్ల పరిధిలో గంజాయి వినియోగదారుల కదలికలపై నిఘా పెంచింది. ఇటీవల మక్తల్‌లో గంజాయి పట్టుబడటంతో ఎస్పీ మరింత సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మరికల్ పోలీస్ సర్కిళ్ల పరిధిలో పోలీసులు టాస్క్‌ఫోర్స్ బృందాలుగా ఏర్పడి, గతంలో గంజాయికి అలవాటుపడి మానేసిన వారు తిరిగి ఆ వ్యసనం బారిన పడుతున్నారా..? కొత్తగా ఎవరైనా వినియోగిస్తున్నారా..? అన్న కోణంలో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
దసరా పండుగ నుంచి గంజాయి వినియోగం, సరఫరాపై పటిష్ట నిఘా ఉంచారు. అనుమానితులకు చేస్తున్న పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వినియోగదారుల వివరాల సేకరణతో పాటు గంజాయి సరఫరా మూలాలపై ఆరా తీస్తుండటంతో అక్రమ వ్యవహారాల్లో ఉన్న వారిలో కలవరం మొదలైందన్న చర్చ సాగుతోంది. కొందరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారని.. మరికొందరు తమ గ్రామాలను విడిచి వెళ్తున్నట్లు సమాచారం. వినియోగదారుల నుంచి సరఫరాదారుల వరకు గంజాయి నెట్‌వర్క్ గుట్టు విప్పడమే లక్ష్యంగా ఖాకీల వేట సాగుతుండటంతో జిల్లాలో మత్తు ముఠాల గుండెల్లో గుబులు మొదలైందని చెప్పవచ్చు.
జిల్లాలోని నాలుగు సర్కిల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో దాదాపు 300 టెస్టింగ్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా.. 70 మంది వరకు గంజాయి తీసుకున్నట్లు తేలినట్లు తెలిసింది. వినియోగదారుల వద్దకే దర్యాప్తును పరిమితం చేయకుండా.. వారికి గంజాయి ఎక్కడి నుంచి అందుతోంది.? ఎవరి ద్వారా సరఫరా జరుగుతోంది.? సరఫరా వెనుక ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా.? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ప్రత్యేక బృందాలతో విస్తృతంగా
తనిఖీలు
మత్తు గుట్టు విప్పుతున్న పోలీసులు
అందుబాటులో 300 టెస్టింగ్ కిట్లు
గంజాయి బ్యాచ్‌లో వణుకు
పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి.. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు సాగుతున్న రాకపోకలపై పోలీసు నిఘాను పటిష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల మీదుగా గంజాయి అక్రమ రవాణా సాగుతోందనే అనుమానాల నేపథ్యంలో అంతర్రాష్ట్ర మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. వాహనాల తనిఖీలు, అనుమానాస్పద కదలికల పరిశీలనతో సరఫరా మార్గాలను గుర్తించే దిశగా పోలీసుల కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించిన 100 మందిలో పాజిటివ్ వచ్చిన 70 మందిపై చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది కీలకంగా మారింది. వారికి జిల్లా జనరల్ ఆస్పత్రిలోని డీ–అడిక్షన్ కేంద్రంలో చికిత్స, కౌన్సెలింగ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన తర్వాత వారిని వైద్యపరంగా నిర్ధారించడం, మానసిక ఆరోగ్య సహాయం, నిరంతర కౌన్సెలింగ్ అందించడం ద్వారా వ్యసనం నుంచి బయటపడేసేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


