ఓటు హక్కుతోనే రాజ్యాంగానికి రక్ష | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కుతోనే రాజ్యాంగానికి రక్ష

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

నారాయణపేట: బడుగు, బలహీన వర్గాల ఓటు హక్కుకు రక్షణ కల్పించినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టినట్లు అవుతుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి అన్నారు. అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘ఓటు బచావో – దేశ్‌ బచావో’, ‘ఓటు చోరీ ఆపండి – దేశాన్ని కాపాడండి’ ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు కె. ప్రశాంత్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో సామాన్యుడి గొంతుక అని అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఈ హక్కును పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని.. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా చూడటంతో పాటు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేయని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ సర్కార్‌ కుట్ర పన్నుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సర్‌ ప్రక్రియను వినియోగించుకుంటున్నదని ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్‌ బచావో’ జన మార్చ్‌, నిరసన సభను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. రాబోయే పాలమూరు – రంగారెడ్డి – హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సామా రామ్మోహన్‌రెడ్డి విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఓటు హక్కు పరిరక్షణపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో, లేదో పరిశీలించుకోవాలని.. పేరు లేకపోతే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్ర దాస్‌, టీపీసీసీ కోఆర్డినేటర్‌ రాచమల్ల సిద్ధిశ్వర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆర్‌.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement